icon icon icon
icon icon icon

Prakash Ambedkar: భాజపా కంచుకోటలో.. అంబేడ్కర్‌ వారసుడు నెగ్గేనా?

భాజపా కంచుకోటగా ఉన్న అకోలా పార్లమెంటు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది.

Published : 24 Apr 2024 00:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రధాన పార్టీల చీలికలతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారాయి. ముఖ్యంగా భాజపా కంచుకోటగా ఉన్న అకోలా నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. మరాఠా వర్గానికి చెందిన వ్యక్తిని కాంగ్రెస్‌ బరిలో నిలపగా.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మనువడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌.. వంచిత్‌ బహుజన్‌ అఘాడీ (VBA) తరఫున పోటీ చేస్తున్నారు. భాజపా సీనియర్‌ నేత, 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన సంజయ్‌ ధోత్రే కుమారుడు అనూప్‌ ధోత్రేను కాషాయ పార్టీ ఈసారి రంగంలోకి దించింది. అయితే, మరాఠా వర్గానికి చెందిన నేత రాకతో ఇక్కడ రాజకీయ సమీకరణాలు మారడం.. భాజపా విజయావకాశాలకు గండికొట్టవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు భాజపా కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రకాశ్‌ అంబేడ్కర్‌ మళ్లీ విజయం సాధించేనా? అనే అంశం ఆసక్తికరంగా మారింది.

పశ్చిమ విదర్భ పరిధిలో ఉన్న అకోలా నియోజకవర్గం గతంలో కాంగ్రెస్‌ బలంగా ఉండేది. 1980ల్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన వసంత్‌ సాఠే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1989లో భాజపా నేత పాండురంగ ఫండ్కర్‌ రాకతో కాంగ్రెస్‌ కంచుకోటకు బీటలు వారాయి. అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మనువడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ అక్కడి నుంచే రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. 1998, 1999 మినహా అక్కడ భాజపా బలంగా ఉంది. 2014, 2019 ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థి హిదయతుల్లా పటేల్‌ను పోటీ చేయించిన కాంగ్రెస్‌.. తాజాగా మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మహా వికాస్‌ అఘాడీ తరఫున మరాఠా వర్గానికి చెందిన డాక్టర్‌ అభయ్‌ పాటిల్‌ను బరిలో నిలిపింది.

శివసేన, ఎన్‌సీపీ పార్టీల్లో చీలికలను ప్రస్తావించిన కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి అజార్‌ హుస్సేన్‌.. విదర్భలో మహావికాస్‌ అఘాడీ గాలి వీస్తోందన్నారు. ఆ రెండు పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నందున హిందుత్వ ఓట్లు పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ ప్రకటిస్తోన్న హామీలపై ప్రజల నుంచి స్పందన వస్తోందని చెప్పారు. ఇక వంచిత్‌ బహుజన్‌ అఘాడీ నేత ప్రకాశ్‌ అంబేడ్కర్‌ తన ఓటు షేరును కాపాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. భాజపా ఎమ్మెల్యే రణధీర్‌ సావర్కర్‌ మాట్లాడుతూ.. ఎంపీ సంజయ్‌ ధోత్రే చేసిన అభివృద్ధి కాషాయ పార్టీని మళ్లీ గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని