icon icon icon
icon icon icon

ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్‌ అసత్య ప్రచారం

అసత్య ప్రచారాలతో సమాజంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్‌ ప్రవర్తిస్తోందని భాజపా ఆరోపించింది. భాజపాకు 400 సీట్లిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాలు చేస్తోందని పేర్కొంటూ గురువారం ఎన్నికల సంఘానికి (ఈసీ) కాషాయ పార్టీ ఫిర్యాదు చేసింది.

Updated : 03 May 2024 06:37 IST

ఈసీకి భాజపా ఫిర్యాదు

దిల్లీ: అసత్య ప్రచారాలతో సమాజంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్‌ ప్రవర్తిస్తోందని భాజపా ఆరోపించింది. భాజపాకు 400 సీట్లిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారాలు చేస్తోందని పేర్కొంటూ గురువారం ఎన్నికల సంఘానికి (ఈసీ) కాషాయ పార్టీ ఫిర్యాదు చేసింది. కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, భాజపా అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది, పార్టీ నేత ఓం పాఠక్‌ ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు. ఇండియా కూటమిలోని పార్టీలు డీప్‌ ఫేక్‌ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నాయని వారు ఆరోపించారు. అమిత్‌ షాపైనా వీడియోలు చేశాయని విమర్శించారు. ‘కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలు.. మా పార్టీ నేతలపై, విధానాలపై, రాజ్యాంగ వ్యవస్థలపై నిరంతరాయంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. సమాజంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టే వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అటువంటి 15 ఘటనలను ఈసీ దృష్టికి తీసుకెళ్లాం’ అని ఈసీకి ఫిర్యాదు అనంతరం మీడియాకు త్రివేది వెల్లడించారు. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగకుండా ఒక పద్ధతి ప్రకారం అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తొలుత కాంగ్రెస్‌ ఆరోపణలు చేస్తుందని, ఆ తర్వాత మిగిలిన పార్టీలు దానిని ప్రచారం చేస్తాయని విమర్శించారు. అదే అంశాలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తారని తెలిపారు. డీప్‌ ఫేక్‌ వీడియోలతో చట్ట వ్యతిరేక పద్ధతుల్లో ప్రజల్లో అయోమయం సృష్టించడమే కాంగ్రెస్‌ పని అని విమర్శించారు. తమ ఫిర్యాదుపై పూర్తి వివరాలను తెలుసుకున్న ఈసీ.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని త్రివేది తెలిపారు.

గత రెండు విడతల పోలింగ్‌లలో రాజకీయ అబద్ధాలను ప్రచారం చేసి లబ్ధి పొందాలని కాంగ్రెస్‌ చూసిందని రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆరోపించారు. అందులో భాగమే భాజపా గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని చేసిన ప్రచారమని స్పష్టం చేశారు. ఈసీ ఈ అంశాలపై దృష్టి సారించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్‌ గాంధీ తదితరులు చేసిన ప్రసంగ కాపీలను ఈసీకి కాషాయ పార్టీ నేతలు అందజేశారు. రాహుల్‌ గాంధీ బహిరంగంగా ప్రజలకు, ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పాలని ఆదేశించాలని వారు కోరారు. రాహుల్‌ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ద్రవ్యోల్బణాన్ని తగ్గించాం

యూపీఏ హయాంలో రెండంకెల్లో ఉన్న ద్రవ్యోల్బణం ఇపుడు అతి తక్కువగా 3.2 శాతానికి చేరిందని భాజపా అధికార ప్రతినిధి సయ్యద్‌ జఫర్‌ ఇస్లాం తెలిపారు. మరో అధికార ప్రతినిధి గోపాలకృష్ణ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ఏప్రిల్‌ నెల రికార్డు స్థాయిలో వసూలైన రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ప్రతీకగా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలో కోత విధించి ముస్లింలకు కట్టబెట్టాలని చూస్తున్న కాంగ్రెస్‌ను అడ్డుకున్న ప్రధాని మోదీ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ కలలను నిజం చేస్తున్నారని ఉత్తర్‌ ప్రదేశ్‌ మంత్రి బేబీరాణి మౌర్య పేర్కొన్నారు. గురువారం వారు మీడియాతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img