icon icon icon
icon icon icon

Rahul Gandhi-Priyanka: నామినేషన్లకు ముందు.. అయోధ్యకు రాహుల్‌, ప్రియాంక గాంధీ?

Rahul Gandhi-Priyanka: కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ త్వరలో అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అమేఠీ, రాయ్‌బరేలీ నుంచి వారి నామినేషన్లకు ముందు ఈ పర్యటన ఉండొచ్చని సమాచారం.

Updated : 25 Apr 2024 10:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ, రాయ్‌బరేలీలో కాంగ్రెస్‌ (Congress) అభ్యర్థులు ఎవరనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. గాంధీ కుటుంబసభ్యులే ఈ స్థానాల నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పోటీ చేస్తున్న వయనాడ్‌లో పోలింగ్‌ తర్వాత యూపీ సీట్లపై స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే, ఈ మధ్యలో రాహుల్‌, ఆయన సోదరి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) అయోధ్య (Ayodhya) సందర్శనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి.

వయనాడ్‌లో బుధవారంతో ఇక్కడ ప్రచార గడువు ముగియగా.. ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది. ఇదే రోజున అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అమేఠీ నుంచి రాహుల్‌, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలు బలంగా కన్పిస్తున్నాయి. ఏప్రిల్‌ 30 తర్వాత దీనిపై అధికారిక ప్రకటన ఉండొచ్చని సదరు వర్గాలు చెబుతున్నాయి. వయనాడ్‌లో ప్రచారం ముగియడంతో ఈ అన్నాచెల్లెళ్లు ఇక యూపీ సీట్లపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

ఈ రెండు స్థానాలకు నామినేషన్‌ వేసేందుకు మే 3 ఆఖరు తేదీ. దానికి రెండు రోజుల ముందే రాహుల్‌, ప్రియాంక వేర్వేరు రోజుల్లో నామినేషన్‌ వేసే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ఆయా స్థానాల్లో వీరు ప్రచారం మొదలుపెట్టడానికి ముందు అయోధ్యలో బాలరాముడిని దర్శించుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో జరిగిన శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్‌ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌, ప్రియాంక అక్కడకు వెళ్లనున్నట్లు ఇప్పుడు వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

2004 నుంచి వరుసగా మూడు సార్లు అమేఠీకి రాహుల్‌ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. 2019లో భాజపా నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. తాజా ఎన్నికల్లో మరోసారి స్మృతి అమేఠీ బరిలో ఉండగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. రాహుల్ పోటీ చేసే అవకాశాలుండగా.. అటు ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా కూడా ఇక్కడ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక, కాంగ్రెస్‌కు పట్టున్న రాయ్‌బరేలీకి 2004 నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల ఆమె లోక్‌సభ బరి నుంచి వైదొలిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా మే 20న ఈ రెండు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img