icon icon icon
icon icon icon

Political slogans: స్లో‘గన్‌’ అందుకుంటే పేలాల్సిందే.. జనాల్లో నాటుకుపోయిన నినాదాలివే!

Political slogans: ఎన్నికల వేళ ప్రచారమంతా ఒకెత్తయితే.. రాజకీయ నినాదాలు మరో ఎత్తు..! తమ మాటలు, విధానాలు జనంలోకి సూటిగా, సుత్తి లేకుండా వెళ్లేందుకు పార్టీలు వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తాయి. మరి మన దేశ చరిత్రలో అలా గుర్తుండిపోయిన టాప్‌ స్లోగన్స్‌ ఏంటో తెలుసా?

Updated : 23 Apr 2024 17:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘అబ్‌కీ బార్‌ 400 పార్‌’.. తాజా సార్వత్రిక ఎన్నికల్లో భాజపా (BJP) విస్తృతంగా ప్రచారం చేస్తున్న నినాదం ఇది. ‘400 సీట్లతో మరోసారి అధికారంలోకి వస్తాం’ అనేది దాని సారాంశం. దేశ చరిత్రలో రాజకీయ నినాదం (Political slogans) అనేది ఎన్నికల ప్రక్రియలో అంతర్భాగమే. ఎన్నికలేవైనా సరే ఓటర్లకు చేరువ కావాలంటే పార్టీల ఉద్దేశాలు జనంలోకి వేగంగా వెళ్లాలి. అయితే, సుదీర్ఘ ప్రసంగాల కంటే సింగిల్‌ లైన్‌లో చెప్పే స్లోగన్స్‌ ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. నాటి ‘జై జవాన్‌... జై కిసాన్‌’ నుంచి నేటివరకు జనం నోళ్లలో నానిన నినాదాలను ఓసారి గుర్తుచేసుకుందాం..!

అబ్‌కీ బార్‌.. 400 పార్‌..

తాజా సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాలని భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి యోచిస్తోంది. ఒక్క భారతీయ జనతా పార్టీనే 370 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలదళం.. మొత్తంగా 400 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తంచేస్తోంది. తమ లక్ష్యాలను ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్లేలా ఈ నినాదంతో భాజపా నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ భాజపా ‘ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’ స్లోగన్‌తో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అచ్చే దిన్‌ ఆనే వాలే హై..

పదేళ్ల కాంగ్రెస్‌ను గద్దె దించి 2014లో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల సమయంలో అప్పటి యూపీఏ పాలనలో లోపాలు, కుంభకోణాలను ఎత్తిచూపుతూ ‘అచ్చే దిన్‌ ఆనే వాలా హై’ అని భాజపా పిలుపునిచ్చింది. దీని అర్థం మంచి రోజులు వస్తున్నాయి అని. ఈ నినాదం ప్రజల్లోకి వెళ్లి భాజపాకు పట్టం కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించింది.

కాంగ్రెస్‌ కా హాథ్‌.. ఆమ్‌ ఆద్మీ కా సాథ్‌

2004లో కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కల్పించిన నినాదం ఇది. వారి పార్టీ గుర్తయిన హస్తాన్ని ప్రత్యేకంగా తీసుకుని.. ‘కాంగ్రెస్‌ చేయి సామాన్యుడితోనే’ అనే అర్థంలో దీన్ని తీసుకొచ్చారు. ఇది విపరీతంగా ప్రజాదరణ పొందడంతో.. ఆ ఎన్నికల్లో మన్మోహన్‌ సింగ్ నేతృత్వంలో యూపీఏ కూటమి విజయం సాధించగలిగింది.

భారత్‌ వెలిగిపోతోంది..

ఈ నినాదం కూడా 2004 ఎన్నికల నాటిదే. వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ‘ఇండియా షైనింగ్‌’ నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక ఆశావాదానికి సంకేతంగా దీన్ని తీసుకొచ్చారు. అప్పట్లో ఈ నినాదం జనం నోళ్లల్లో బాగానే నాటుకుపోయినప్పటికీ.. ఎన్డీయేకు మాత్రం విజయం అందించలేకపోయింది.

బారీ బారీ సబ్‌కీ బారీ.. అబ్‌కీ బారీ అటల్‌ బిహారీ

1996లో భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వెళ్లింది ఈ నినాదంతోనే. ‘అందరి వంతు అయిపోయింది.. ఇప్పుడు అటల్‌  బిహారీ వంతు’ అనేది దీనర్థం. లఖ్‌నవూలోని ఓ ఎన్నికల ప్రచారంలో వాజ్‌పేయీ ఈ నినాదమిచ్చారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా విపరీతంగా ప్రచారమైంది. అవినీతి మచ్చలేని ఆయన ప్రధాని అభ్యర్థిగా నిలబడిన ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది. అయితే ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది.

జబ్‌ తక్‌ సూరజ్‌ చాంద్‌ రహేగా.. ఇందిరా తేరా నామ్‌ రహేగా

1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఈ నినాదం ఇచ్చింది. ‘సూర్య చంద్రులు ఉన్నంతవరకు ఇందిరాగాంధీ పేరు గుర్తుండిపోతుంది’ అంటూ ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీ ప్రజల్లోకి వెళ్లారు. ఇది బాగా పనిచేసి.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 404 స్థానాలను దక్కించుకుంది. 77 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఒక పార్టీ లేదా సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఆ స్థాయిలో మెజార్టీ దక్కించుకోవడం అప్పుడే. ఆ తర్వాత ఇప్పటివరకు ఈ రికార్డును ఏ ప్రభుత్వం సాధించలేకపోయింది.

ఇందిరా హటావో.. దేశ్‌ బచావో..

1975-77 మధ్య అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీతో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆ సమయంలో సోషలిస్ట్‌ నేత జయప్రకాశ్‌ నారాయణ్‌ ‘ఇందిరా హటావో.. దేశ్‌ బచావో (ఇందిరాను ఓడించాలి.. దేశాన్ని కాపాడాలి)’ అని పిలుపునిచ్చారు. ఈ నినాదంతోనే ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ కింద ఏకమై 1977 ఎన్నికల్లో విజయం సాధించాయి.

గరీబీ హటావో..

1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన నినాదమిది. ‘పేదరికాన్ని పారద్రోలుదాం’ అంటూ ప్రజల్లోకి వెళ్లిన హస్తానికి ఆ ఎన్నికల్లో ఘన విజయం దక్కింది. అయితే, ఈ నినాదం ఇప్పటికీ ప్రాచుర్యంలోనే ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత శక్తిమంతమైన నేత ఇచ్చిన ‘గరీబీ హటావో’ హామీ దేశ చరిత్రలోనే అతి పెద్ద బూటకమని ప్రధాని మోదీ సహా భాజపా నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.

జై జవాన్‌.. జై కిసాన్‌

దేశ రెండో ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి 1965లో యూపీలో జరిగిన ఓ సభలో ఈ నినాదమిచ్చారు. కుటుంబాలకు దూరంగా సరిహద్దుల్లో గస్తీ కాస్తూ దేశాన్ని కాపాడుతున్న జవాన్ల త్యాగాలు, దిగుమతులపై ఆధారపడకుండా ప్రజల ఆకలి తీరుస్తున్న రైతుల కష్టాన్ని కొనియాడుతూ ఆయన ఈ పిలుపునిచ్చారు. ఇక, 1998లో అప్పటి ప్రధాని వాజ్‌పేయీ ఈ నినాదాన్ని కాస్త మార్చి ‘జై జవాన్‌, జై కిసాన్‌, జై విజ్ఞాన్‌’ అని చేర్చారు. పోఖ్రాన్‌ అణు పరీక్షలతో మన దేశం చాటిన వైజ్ఞానిక సత్తాను అభినందిస్తూ వాజ్‌పేయీ ఈ నినాదమిచ్చారు.

వీటితో పాటు పలు రాజకీయ పార్టీలు సందర్భానికి అనుగుణంగా కొత్త కొత్త స్లోగన్లతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశాయి. 2011లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ‘మా మాటి మనుష్‌’ అని పిలుపునివ్వగా.. దిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ‘అచ్చే బీతే పాంచ్‌ సాల్‌.. లగే రహో కేజ్రీవాల్‌’ అని నినదించింది. అధికారంలో ఉండే పార్టీ అయితే తమ హయాంలోని అభివృద్ధిని చాటిచెబుతూ.. ప్రతిపక్షమైతే పాలనలో లోపాలను ఎత్తిచూపుతూ ఇలా స్లో‘గన్‌’లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img