icon icon icon
icon icon icon

Lok Sabha Polls: భారతమాత బిడ్డగా వేడుకొంటున్నా.. నియంతృత్వాన్ని ఓడించండి: సునీత

దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీత ఆప్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Published : 28 Apr 2024 23:23 IST

దిల్లీ: దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind kejriwal) సతీమణి సునీత (Sunita kejriwal) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ దిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఆప్‌ అభ్యర్థి మహాబల్‌ మిశ్రా తరఫున ఆమె ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై నిలబడి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతుండగా.. పలువురు మహిళలు ఆమెపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. తన భర్త కేజ్రీవాల్‌ను సింహంతో పోల్చారు. దిల్లీలో పాఠశాలలు నిర్మించడం, ఉచిత విద్యుత్‌ అందించడం, మొహల్లా క్లీనిక్‌లను ప్రారంభించినందువల్లే తన కేజ్రీవాల్‌ జైలుకెళ్లారన్నారు.  ‘‘మీ సీఎం ఒక షేర్‌. ఎవరూ ఆయన తల వంచలేరు. భారతమాత బిడ్డగా  మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా.. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటేయండి. నియంతృత్వానికి మీ ఓటుతో సమాధానం చెప్పండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మీ ఓటు విలువ అర్థం చేసుకోండి’’ అని కోరారు. 

మద్యం విధానం కేసులో మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌ ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉండటంతో ఆయన సతీమణి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఆప్‌ అభ్యర్థుల తరఫున రోడ్‌షోలు నిర్వహిస్తూ పార్టీ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. తన భర్త అరెస్టును నిరసిస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. సౌత్‌ దిల్లీ, న్యూదిల్లీ నియోజకవర్గాలతో పాటు గుజరాత్‌,హరియాణా, పంజాబ్‌లలోనూ సునీత ఆప్‌ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img