icon icon icon
icon icon icon

PM Narendra Modi: 26,000 మంది జీవితాలతో టీఎంసీ చెలగాటం: ప్రధాని మోదీ విమర్శలు

పశ్చిమబెంగాల్‌లో ఉద్యోగ నియామకాల కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. మమతా సర్కారు 26 వేల మంది జీవితాలతో ఆడుకుంటోందన్నారు.  

Published : 26 Apr 2024 14:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ (TMC) ప్రభుత్వం 26,000 మంది బతుకుదెరువుతో ఆటలాడుతోందని ప్రధాని మోదీ (PM Modi) మండిపడ్డారు. ఆయన శుక్రవారం మాల్డాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలోని స్కూల్‌ జాబ్స్‌ స్కాంపై మమతా సర్కార్‌ను తప్పుపట్టారు. 

ఈసందర్భంగా మోదీ మాట్లాడుతూ ‘‘పశ్చమబెంగాల్‌ యువత జీవితాలతో టీఎంసీ చెలగాటమాడింది. నియామకాల్లో భారీ కుంభకోణం కారణంగా 26,000 మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అప్పులు చేసి టీఎంసీకి లంచాలు చెల్లించి ఉద్యోగాల్లో చేరినవారు ఇప్పుడు వీధిన పడ్డారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మాత్రమే యువతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగాలు కల్పిస్తోంది. 

ఒకప్పుడు దేశం మొత్తానికి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధిలో బెంగాల్‌ ఆదర్శంగా నిలిచింది. తొలుత వామపక్ష కూటమి, తర్వాత టీఎంసీ పాలన ఇక్కడి అభివృద్ధిని పూర్తిగా కుంటుబరిచాయి. మమతా సర్కారు హయాంలో వేల కోట్ల కుంభకోణాలకు రాష్ట్రం వేదికగా మారింది. వీటిల్లో శారదా, రోజ్‌ వ్యాలీ, రేషన్‌ స్కాం, నియామకాల కుంభకోణం వంటివి చోటుచేసుకొన్నాయి. ప్రతిచోటా అవినీతిమయంగా మార్చేసింది. కమీషన్లు లేకుండా బెంగాల్‌లో ఏ పనీ జరగదు.

టీఎంసీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకొనే ఏ అవకాశాన్ని వదులుకోలేదు. కేంద్రం నుంచి నిధులు సేకరించింది.  కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలుకాకుండా అడ్డుకొన్నారు. ప్రజాసంక్షేమాన్ని ఆ పార్టీ ఏమాత్రం పట్టించుకోదు. రాష్ట్రంలోకి వందేభారత్‌ రైళ్లను రానీయలేదు. మహిళల నమ్మకాన్ని టీఎంసీ వమ్ము చేసింది. మాల్డాలో మహిళలపై అరాచకాలను ప్రభుత్వం చూస్తూ ఊరుకొంది. సందేశ్‌ఖాలీలో ఆడవారిపై అత్యాచారాలకు పాల్పడిన నిందితుడిని ఆ పార్టీ రక్షించింది. బుజ్జగింపు రాజకీయాల కోసం టీఎంసీ, ఇండియా కూటమి ఎంతవరకైనా వెళతాయి. వారు అధికారంలోకి వస్తే సీఏఏను రద్దు చేస్తారట’’ అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.    

పశ్చిమబెంగాల్‌లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్‌ఎల్‌ఎస్‌టీ)పై కలకత్తా హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. నాటి పరీక్ష ద్వారా జరిపిన పాతిక వేలకుపైగా నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది. వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నాడు 24,640కి మించి ఇతర ఖాళీలకు ఎంపికైనవారిని, నియామక గడువు ముగిశాక ఉద్యోగం పొందినవారిని, ఖాళీ ఓఎంఆర్‌ షీట్‌లు సమర్పించినా ఉద్యోగం వచ్చినవారిని అవసరమైతే కస్టడీలోకి తీసుకొని మరీ విచారణ జరపాలని సూచించింది. ఇప్పటివరకు తీసుకొన్న జీతాలను కూడా వాపస్‌ ఇవ్వాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img