icon icon icon
icon icon icon

Loksabha polls: అమేఠీ సస్పెన్స్‌ వేళ.. వాద్రా పోస్టర్లు వైరల్‌

లోక్‌సభ ఎన్నికల వేళ అమేఠీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎవరిని ప్రకటిస్తుందనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Updated : 24 Apr 2024 13:28 IST

అమేఠీ: ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్‌ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పార్టీ కార్యాలయం బయట వెలసిన ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా పోస్టర్లు కొత్త చర్చకు దారితీశాయి. ఆ పోస్టర్లలో ‘‘అమేఠీ ప్రజలు ఈసారి రాబర్ట్‌ వాద్రాను కోరుకుంటున్నారు’’ అని రాసి ఉంది. దీంతో ఈ స్థానం నుంచి రాహుల్‌ పోటీ ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని భాజపా తన అభ్యర్థిగా ప్రకటించింది. గతంలో సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం గాంధీల కుటుంబానికి కంచుకోటగా పేరొందింది. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన రాహుల్‌.. భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో  రాహుల్‌ గాంధీ వయనాడ్‌తోపాటు అమేఠీ నుంచి కూడా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాబర్ట్‌ వాద్రా పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. అమేఠీ నుంచి  పోటీ చేస్తారా..? అని ఇటీవల రాహుల్‌ను మీడియా ప్రశ్నించగా పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. మరోవైపు రాబర్ట్‌ వాద్రా మాట్లాడుతూ ఈ నియోజకవర్గ ప్రజలు తన ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారని, సరైన సమయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 

భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ తాజాగా స్పందిస్తూ అభ్యర్థిని ప్రకటించడంలో కాంగ్రెస్‌ జాప్యం చేస్తోందని విమర్శించారు. ‘‘ఇలా ఎప్పుడైనా జరిగిందా? పోలింగ్‌కు ఇంకా 27 రోజులే ఉంది. కానీ, ఇంకా కాంగ్రెస్‌ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం వారి అహంకారానికి నిదర్శనం. ఈ స్థానంపై రాహుల్‌ గాంధీ బావ (రాబర్ట్‌ వాద్రాను ఉద్దేశిస్తూ) కన్నేశారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారో? ఒకప్పుడు ప్రజలు బస్సుల్లో వెళ్లే సమయంలో సీట్ల కోసం కర్చీఫ్‌ వేసుకునేవారు. ఇప్పుడు రాహుల్‌ కూడా తన సీటును బుక్‌ చేసుకునేందుకు అలానే చేయాలేమో మరి’’ అంటూ ఎద్దేవా చేశారు. అమేఠీ నియోజకవర్గంలో ఐదో దశలో మే 20న పోలింగ్‌ జరగనుండగా.. నామినేషన్‌ దాఖలు చేయడానికి మే 3 చివరి తేదీ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img