icon icon icon
icon icon icon

Lok Sabha polls: ఓటరు స్ఫూర్తి చాటిన ‘సైలెంట్‌ విలేజ్‌’..!

ఊరిలో సగం మంది బధిరులే. అయితేనేం.. ప్రజాస్వామ్య పండగలో పాల్గొనేందుకు తమ వైకల్యం అడ్డుకాదంటూ ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు.

Published : 19 Apr 2024 21:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జమ్మూ-కశ్మీర్‌ (Jammu Kashmir) డోడా జిల్లాలోని ఓ గ్రామం. ఆ ఊరిలో దాదాపు సగం మంది బధిరులే. అయితేనేం.. ప్రజాస్వామ్య పండగలో పాల్గొనేందుకు తమ వైకల్యం అడ్డుకాదంటూ ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో అనేక మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. అన్ని వనరులున్నా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలంటేనే బద్ధకిస్తున్న జనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఓటు హక్కును వినియోగించుకుంటూనే తమ చిరకాల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

మంచు పర్వతాల్లో ఉన్న ధడ్కాహి గ్రామంలో గుజ్జర్లు నివసిస్తున్నారు. ఇది ఉధంపుర్‌ లోక్‌సభ (Lok Sabha Elections) స్థానం పరిధిలో ఉంది. ఇక్కడ 105 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో 55 కుటుంబాల్లో కనీసం ఒకరు పుట్టుకతో మూగ లేదా చెవుడు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామంలో మొత్తం 84 మంది బధిరులు ఉన్నారు. వారిలో 43 మంది మహిళలు, 14 మంది పదేళ్లలోపు చిన్నారులే. అందుకే ఈ గ్రామానికి ‘సైలెంట్‌ విలేజ్‌’గా పేరుపడింది. ఇక్కడ ఈ తరహా పరిస్థితులను తొలిసారిగా 1939లోనే గుర్తించారు.

తాజా ఎన్నికల్లో ఉత్సాహంగా ఓటేసిన బధిరులు.. నేతలు తమ గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తారనే చిన్న ఆశ ఉందన్నారు. రోడ్డు మార్గం, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, ఆరోగ్యకేంద్రంలో వైద్యులను అందుబాటులో ఉంచడంతోపాటు పుట్టుకతో సమస్యను ఎదుర్కొంటున్న తమకు ఓ బధిర పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ తమ డిమాండ్లు నెరవేర్చకపోతే భవిష్యత్‌లో జరిగే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img