icon icon icon
icon icon icon

Scindia: సింధియాల పోరు.. తల్లి ఓటమి కోసం ప్రచారం చేసిన వేళ!

కన్నతల్లికి వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల్లో మాధవరావు సింధియా (Madhavrao Scindia) ప్రచారం నిర్వహించారు.

Updated : 28 Apr 2024 18:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) కోలాహలం కొనసాగుతోంది. పార్టీలకు రెబల్‌గా కొందరు మారుతుంటే.. మరికొన్ని చోట్ల సొంత కుటుంబం నుంచే ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నవారూ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్నతల్లికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాధవరావు సింధియా (Madhavrao Scindia).. ఓటర్లను ఒక్క రూపాయి విరాళం కోసం చేతులు చాచిన కాన్షీరామ్‌ (Kanshi Ram).. వంటి పలు ఆసక్తికర విషయాలను సీనియర్‌ జర్నలిస్టు భాస్కర్‌ రాయ్‌ రాసిన ‘ఫిఫ్టీ ఇయర్‌ రోడ్‌’ పుస్తకంలో ప్రస్తావించారు.

కుమారుడిపై ఆగ్రహం..

గ్వాలియర్‌ మహారాజు జీవాజిరావు సింధియా మరణానంతరం.. ఆయన భార్య విజయరాజే సింధియా ఆయన వారసత్వాన్ని కొనసాగించారు. కుమారుడు మాధవరావును జన సంఘ్‌ భవిష్యత్తు నేతగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఇలా ఆయన తీసుకున్న నిర్ణయం విజయరాజేకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.

నానమ్మ కోరిక తీర్చిన సింధియా

1989 లోక్‌సభ ఎన్నికల్లో విజయరాజే సింధియా భాజపా తరఫున పోటీలో నిలబడ్డారు. గుణ స్థానం నుంచి రంగంలో దిగారు. ఈ క్రమంలో ఆమెకు విజయం దక్కకుండా మాధవరావు సింధియా ప్రయత్నాలు చేశారు. భాజపా చెప్పినట్లు తన తల్లి వ్యవహరిస్తున్నారని.. ఈ క్రమంలో ఆమె హోదాను దుర్వినియోగం చేస్తున్నారని మాధవరావు భావించారట. రాజకుటుంబ ఆస్తుల నిర్వహణపై తగాదాలే ఈ చీలికకు కారణమని రాజ కుటుంబ వ్యవహారాలు తెలిసిన వ్యక్తులు పేర్కొన్నట్లు తాజా పుస్తకంలో వెల్లడించారు.

వన్‌ వోట్‌.. వన్‌ నోట్‌

1988లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికల్లో అలహాబాద్‌ నుంచి కాన్షీరామ్‌ పోటీ చేశారు. వీపీ సింగ్‌, కాంగ్రెస్‌ నుంచి సునీల్‌ శాస్త్రితో తలపడిన ఆయన.. 72 వేల ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇందులో సింగ్‌ విజయం సాధించారు. అయితే, కాన్షీరామ్‌ భిన్న నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ‘‘ఓట్లను రాబట్టేందుకు పెద్ద పార్టీలు మద్యం, నగదు ముమ్మరంగా పంచి పెట్టాయి. అలహాబాద్‌లో.. తనకు మద్దతుగా నిలిచే ప్రతి ఓటరు ఒక రూపాయి ఇవ్వాలని కోరాను. ‘వన్‌ వోట్‌.. వన్‌ నోట్‌’ నినాదంతో ప్రచారం నిర్వహించా’’ అని కాన్షీరామ్‌ చెప్పినట్లు పుస్తకంలో పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, దేశ సమకాలీన చరిత్రలో కీలక మైలురాళ్లను ఆ పుస్తకంలో వివరించారు. 1971లో బంగ్లాదేశ్‌ లిబరేషన్‌ వార్‌, నక్సల్బరీ తిరుగుబాటు, జార్జ్‌ ఫెర్నాండెజ్‌ రైల్‌ స్ట్రైక్‌, ఎమర్జెన్సీ, ఆపరేషన్‌ బ్లూస్టార్‌, ఇందిరా గాంధీ హత్య, టెక్నాలజీ కోసం రాజీవ్‌ గాంధీ తీసుకున్న చొరవ, ఎల్‌టీటీఈ ఉగ్రవాదుల చేతిలో రాజీవ్‌ మరణం, బాబ్రీ మసీదు కూల్చివేత,  సోనియా-మన్మోహన్‌ల నేతృత్వంలో యూపీఏ సారథ్యం, మోదీ అధికారంలోకి రావడం వంటి అంశాలు అందులో ప్రస్తావించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img