icon icon icon
icon icon icon

Sharad Pawar: ‘ఇండియా కూటమిపై ప్రభావం ఉండదు.. రాహుల్‌ యాత్ర తర్వాత తెలంగాణలో మార్పు!’

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘ఇండియా’ కూటమిపై ఎటువంటి ప్రభావం చూపబోవని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.

Published : 03 Dec 2023 16:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Assembly Elections Results) వెలువడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ (Congress) అధికారం దిశగా దూసుకెళ్తుండగా.. మిగతా మూడు రాష్ట్రాల్లో మాత్రం భాజపా (BJP)దే పైచేయి. ఇందులో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ఇదివరకు కాంగ్రెస్‌ అధికారంలో ఉండటం గమనార్హం. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే ఈ ఎన్నికల ఫలితాల వేళ.. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు విపక్ష కూటమి ‘ఇండియా (INDIA Bloc)’ నేతలు త్వరలో సమావేశం కానున్నారు. ఈ క్రమంలోనే కూటమి విషయంలో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar) కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘ఇండియా’ కూటమిపై ఎటువంటి ప్రభావం చూపబోవని పేర్కొన్నారు.

ఎన్నికల ఫలితాల వేళ.. ఇండియా కూటమి కీలక నిర్ణయం

‘‘ఈ ఎన్నికల ఫలితాలు ‘ఇండియా’ కూటమిపై ప్రభావం చూపుతాయని అనుకోవడం లేదు. దిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో త్వరలో మేం సమావేశం కానున్నాం. క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉన్నవారితో మాట్లాడతాం. ఆ తర్వాతే ఈ ఫలితాలపై వ్యాఖ్యానించగలం’’ అని పవార్ అన్నారు. ప్రస్తుత పరిణామాలు భాజపాకు అనుకూలంగా ఉన్నాయని అంగీకరించారు. మరోవైపు.. తెలంగాణ ఫలితాలపై ఇప్పుడే స్పందించడం తొందరపాటు చర్యే అవుతుందని చెప్పారు. ‘‘ఇదివరకు తెలంగాణలో భారాస మళ్లీ అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. అయితే, రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’కు రాష్ట్రంలో విశేష స్పందన లభించింది. దీని తర్వాత స్థానికంగా మార్పు వస్తుందని భావించాం. అలాగే జరిగింది’’ అని శరద్‌ పవార్ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img