ఆస్ట్రిచ్‌ గుడ్డుపై అందమైన కళాకృతి

కలప, రాతి శిలలపై ఆకృతులను రూపొందించడం ఒక కళ. దీని మరింత వైవిధ్యంగా మలిచి భిన్నమైన వస్తువులతో కళాకృతులు ఆవిష్కరించేవారూ ఉన్నారు. సుద్దుముక్కలు, పెన్సిల్‌ మొన, గింజలు ఇలా చిన్న చిన్న వాటిపై కూడా అందమైన ఆకృతులు చెక్కుతుంటారు. కానీ ఓ వ్యక్తి

Published : 13 Feb 2021 20:04 IST

(Photo: Diem Duy youtube video screenshot)

ఇంటర్నెట్‌ డెస్క్‌: కలప, రాతి శిలలపై ఆకృతులను రూపొందించడం ఒక కళ. దీనికన్నా మరింత వైవిధ్యంగా మలిచి భిన్నమైన వస్తువులతో కళాకృతులు ఆవిష్కరించేవారూ ఉన్నారు. సుద్దముక్కలు, పెన్సిల్‌ మొన, గింజలు ఇలా చిన్న చిన్న వాటిపైనా అందమైన ఆకృతులు చెక్కుతుంటారు. కానీ ఓ వ్యక్తి ఆస్ట్రిచ్‌ గుడ్డుపై 45 వేలకు పైగా సూక్ష్మ రంధ్రాలు చేసి అద్భుతమైన కళాకృతిని ఆవిష్కరించాడు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించడమే లక్ష్యంగా ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దాడట.  

వియత్నాంలోని హనొయ్‌కి చెందిన నుయెన్‌ హుంగ్‌ కుయాంగ్‌ మంచి కళాకారుడు. గత పదేళ్లుగా కోడిగుడ్డుపై ఆకట్టుకునే కళాకృతులను గీస్తూ బాగా పాపులర్‌ అయ్యాడు. కొన్నేళ్ల కిందట టర్కీకి చెందిన ఓ వ్యక్తి కోడి గుడ్డుపై 12వేల రంధ్రాలు చేసి గిన్నిస్‌ రికార్డ్‌లోకి ఎక్కాడు. ఈ విషయం తెలుసుకున్న హుంగ్‌ కుయాంగ్‌ తను కూడా అలాంటి రికార్డు ఏదైనా సాధించాలని సంకల్పించాడు. దీంతో ఆస్ట్రిచ్‌ గుడ్డుపై అత్యధిక రంధ్రాలతో కళాఖండం రూపకల్పనకు శ్రీకారం చుట్టాడు. గుడ్డు పగలకుండా దాని ఫలకంపై 45,863 సూక్ష్మరంధ్రాలు చేసి అందమైన కళాకృతిని సృష్టించాడు. ఇందుకోసం హుంగ్‌ మూడేళ్లు శ్రమించాడంటే.. అతడు ఎంత ఓపికతో ప్రయత్నించాడో అర్థమవుతోంది. గుడ్డుపై చేసిన రంధ్రాలు 0.2 మిల్లీమీటర్ల నుంచి 3 మిల్లీమీటర్ల విస్తీర్ణం ఉంటాయట.

‘‘కోడి గుడ్డు ఫలకంపై కళాకృతులు చెక్కడం శ్రమతో కూడుకున్న పని. ఆస్ట్రిచ్‌ గుడ్డుపై ఇది మరింత కఠినంగా ఉంది. ఎందుకంటే ఈ గుడ్డు ఫలకం మందంగా.. ధృఢంగా ఉంటుంది. దీనిపై రంధ్రాలు చేసే సమయంలో ఎంతో జాగ్రత్తగా, డ్రిల్లింగ్‌ యంత్రంపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. తొందరపడొద్దు. చిన్న పొరపాటు జరిగినా గుడ్డు పగిలిపోతుంది. అందుకే చివరి రంధ్రం పూర్తయ్యే వరకు ఎంతో ప్రశాంతత, ఏకాగ్రతతో ఉన్నాను’ ’అని హుంగ్‌ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రిచ్‌ గుడ్డుపై హుంగ్‌ చేసిన రంధ్రాలను హై రెజల్యూషన్‌ స్కానింగ్‌ కంప్యూటర్‌తో లెక్కించారు. ప్రస్తుతం హుంగ్‌ కళాకృతికి వియత్నాం రికార్డు ఆర్గనైజేషన్‌ గుర్తింపు లభించింది. గిన్నిస్‌ రికార్డులో చోటు దక్కించుకునేందుకు హుంగ్‌ ప్రయత్నిస్తున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని