దేశాలకు బహుమతులిచ్చిన దేశాలు

ప్రస్తుతం చైనా, నేపాల్‌, పాకిస్థాన్‌తో భారత్‌ దాదాపుగా యుద్ధం చేస్తున్నట్లుగా ఉంది. భారత భూభాగాన్ని కైవసం చేసుకోవడానికి ఆయా దేశాలు యత్నిస్తుంటే.. సొంత భూమిని పరాయి దేశం పాలవకుండా భారత్‌ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇది అలా ఉంచితే.. దేశాలు శత్రుదేశాలతో

Updated : 29 Jun 2020 17:57 IST

శత్రుదేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి. ఆయా దేశాల సైనికుల ప్రాణాలు పోతాయి. అదే మిత్ర దేశాలైతే.. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న దేశాలైతే.. ఆయా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. వారి స్నేహానికి చిహ్నంగా బహుమతులు ఇచ్చుకుంటారు. అలా ఏ దేశం ఏ దేశానికి ఎలాంటి బహుమతులు ఇచ్చిందో ఓ సారి చూద్దాం..

స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ (ఫ్రాన్స్‌ - అమెరికా)

చాలా మందికి తెలుసు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికాకు ఫ్రాన్స్‌ ఇచ్చిన బహుమతి అని. 93 మీటర్ల ఎత్తు ఉండే ఈ విగ్రహం స్వాతంత్ర్యానికి ప్రతీక. అమెరికా స్వతంత్ర పోరాటంలో ఫ్రాన్స్‌ సహకారం.. ఫ్రాన్స్‌లో రాచరికంపై పోరాటంలో అమెరికా పోరాట స్ఫూర్తి.. వారి విజయాలకు దోహదపడ్డాయి. దీంతో అమెరికాకు ఫ్రాన్స్‌ ఓ బహుమతి ఇవ్వాలని భావించింది. ఈ మేరకు స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని ఎంచుకుంది. దీని నిర్మాణాన్ని 1875లో మొదలుపెట్టగా.. 1884లో పూర్తయింది. 1885లో పారిస్‌ నుంచి అమెరికాకు తరలించారు. 1886లో అధికారికంగా అమెరికాకు ఫ్రాన్స్‌ ఈ విగ్రహాన్ని బహుకరించింది.


క్రిస్మస్‌ ట్రీ (నార్వే - యూకె)

నార్వే ఏటా క్రిస్మస్‌ సమయంలో యూకేకు 20 అడుగులకు పైగా ఉండే క్రిస్మస్‌ ట్రీని బహుమతిగా పంపుతోంది. దాన్ని యూకే ప్రభుత్వం లండన్‌లోని ట్రాఫల్గర్‌ స్క్వేర్‌లో ప్రదర్శనకు పెడుతుంది. 1947 నుంచి ఈ తంతు జరుగుతోంది. గతంలో నాజీ సైన్యం నార్వే దేశాన్ని వశం చేసుకోవడానికి వచ్చినప్పుడు నార్వే ప్రతిఘటించింది. ఈ క్రమంలో నార్వేకు బ్రిటన్‌ సాయం చేసింది. ఆ సాయాన్ని గుర్తు చేసుకుంటూ నార్వే ఇలా ఏటా క్రిస్మస్‌ ట్రీని పంపుతోంది.


రెండు పాండాలు (చైనా - అమెరికా)

యూనైటెడ్‌ నేషన్‌, సోవియేట్‌ నేషన్‌ విషయంలో చైనా-అమెరికా మధ్య విభేదాలు వచ్చి 1949 నుంచి 1971 వరకు ఇరు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి. అయితే 1972లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్స్‌ నిక్సన్‌ చైనాలో పర్యటించాడు. అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో రిచర్డ్స్‌ నిక్సన్‌ చైనా పర్యటన గుర్తుగా చైనా ప్రభుత్వం తమ దేశంలోనే పెరిగే రెండు పాండాలను అమెరికాకు కానుకగా ఇచ్చింది.


తులిప్‌ పూలు (నెదర్లాండ్స్‌ - కెనడా)

ప్రపంచయుద్ధాల సమయంలో నెదర్లాండ్స్‌ ఏ దేశానికి మద్దతు పలకలేదు. ఎందుకంటే నెదర్లాండ్స్‌.. జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే మధ్యలో ఉంటుంది ఏ దేశానికి మద్దతిచ్చినా శత్రుదేశం తమమై దాడి చేసే అవకాశముందని మధ్యస్థంగా ఉండిపోయింది. 1940లో నాజీ సైన్యం నెదర్లాండ్స్‌పై దాడి చేసింది. ఈ నేపథ్యంలో అప్పటి డచ్‌ రాజ కుటుంబం పారిపోగా వారికి కెనడా ఆశ్రయమిచ్చింది. అప్పటి నుంచి ఏటా ధన్యవాదాలు తెలుపుతూ కెనడాకు లక్ష చొప్పున తులిప్‌ పువ్వులను పంపుతోంది. కెనడా జాతీయ జెండాలో తులిప్‌ ఉంటుంది.


ఖడ్గం (యూకె - రష్యా)

1942లో జర్మనీ, దాని మిత్ర దేశాలు కలిసి సోవియేట్‌ యూనియన్‌పై యుద్ధం చేశాయి. రష్యాలోని స్టాలిన్‌గార్డ్‌ను సొంతం చేసుకోవాలని జర్మనీ యుద్ధానికి దిగింది. అయితే రష్యా అధినేతగా ఉన్న జోసెఫ్‌ స్టాలిన్‌ సారథ్యంలో జర్మనీపై జరిగిన యుద్ధంలో సోవియేట్‌ యూనియన్‌ గెలిచింది. ఈ విజయానికి గుర్తుగా యూకే రాజు కింగ్‌ జార్జ్‌ 6 జోసెఫ్‌ స్టాలిన్‌కు ఖడ్గాన్ని బహూకరించాడు. ఆ ఖడ్గానికి ఉండే పిడిని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. 


రిసెట్‌ బటన్‌ (అమెరికా - రష్యా)

అమెరికా-రష్యా సంబంధాలు బాగుండాలని ఆకాంక్షిస్తూ 2009లో రష్యాకు అమెరికా ‘రిసెట్‌ బటన్‌’ను బహూకరించింది. అయితే రష్యన్‌ భాషలో రిసెట్‌కు ఓవర్‌లోడ్‌ అనే అర్థం రావడంతో అపార్థం చేసుకున్నారట.


జిరాఫీ ( ఈజిప్ట్‌ - ఫ్రాన్స్‌)

గ్రీక్‌ యుద్ధంలో టర్కీలకు ఫ్రాన్స్‌ రాజు కింగ్ ఛార్లెస్‌ 10 మద్దతు పలికారు. దీంతో ఈజిప్ట్‌కి చెందిన కమాండర్‌ మహ్మద్‌ అలీ ఓ జిరాఫీని ఫ్రాన్స్‌ రాజుకు బహుకరించారు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని