మద్యపాన నిషేధం తెచ్చిన మార్పు

నిన్నటి దాక అక్కడ మద్యం ఏరులైపారి కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఎందరో మహిళల తాళిబొట్లు తెంచింది. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. గాంధీ జయంతి సందర్భంగా గతంలో తీసుకున్న మద్యపాన ..

Updated : 03 Oct 2020 11:22 IST

వరంగల్‌: నిన్నటి దాకా అక్కడ మద్యం ఏరులైపారి కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. ఎంతోమంది మహిళల తాళిబొట్లు తెంచింది. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. గాంధీ జయంతి సందర్భంగా గతంలో తీసుకున్న మద్యపాన నిషేధ నిర్ణయం అందరి జీవితాల్లోనూ మార్పు తెచ్చింది. ఆర్థికంగా మెరుగుపడి అందరూ సంతోషంగా జీవించేందుకు తోడ్పడింది. వివరాల్లోకి వెళితే..
వరంగల్‌ గ్రామీణ జిల్లా దామెర మండలం తక్కెళ్లపాడు గ్రామంలో గతంలో మద్యం ఏరులై పారేది. వృద్ధులు, యువకులు మద్యానికి బానిసలయ్యారు. ఐదేళ్లలో 30 మంది యువకులు మద్యం మహమ్మారికి బలయ్యారు. దీంతో గ్రామస్థులంతా కలిసికట్టుగా ఓ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది అక్టోబర్‌ 2న గాంధీ జయంతి నాడు సంపూర్ణ మద్యనిషేధం కోసం నడుం బిగించారు. మహిళలు, గ్రామ పెద్దలు అంతా కలిసి మద్యం సేవించే వారికి అవగాహన కల్పించారు. దీంతో గొడవలు తగ్గి ఊరు బాగుపడిందని వారు సంతోషంగా చెబుతున్నారు. 

‘‘చాలా మంది మద్యానికి బానిసై గొడవలు పడుతూ, ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటూ, ఆర్థికంగా చితికిపోతున్నారు. గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, గ్రామ స్థాయి ఉద్యోగుల సహకారంతో గత సంవత్సరం సమావేశం నిర్వహించి సంపూర్ణంగా మద్యపానం నిషేధాన్ని అమలు చేసుకోవడం జరిగింది. గ్రామంలో ఒకరిద్దరు మద్యం అమ్మకాలు చేపట్టినా వారిలో కూడా మార్పు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అంతా బాగుంది. సంతోషంగా ఉన్నాం. మద్యపానం వల్లనే అప్పులు, గొడవలు జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాము’’ అని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

ఉల్లంఘిస్తే జరిమానా!
ఇదే తరహాలో మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం మొట్ల తిమ్మాపురంలో పదేళ్ల నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. ఉల్లంఘించిన వారికి రూ.10వేల నుంచి రూ.30 వేల వరకు జరిమానా విధించాలని తీర్మానం చేసుకున్నారు. మద్యపాన నిషేధంతో గ్రామంలో ఎలాంటి ఘర్షణలు లేకుండా ఎవరి పనులు వారు చేసుకుంటూ సంతోషంగా గడుపుతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటి వరకు గ్రామంలోని ఒక్కరు కూడా పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండా తగాదాలు గ్రామంలోనే పరిష్కరించుకుంటున్నట్లు తెలిపారు. ఊరు బాగుపడటంతో ఇప్పుడు అందరి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తున్నాయన్నారు. తాగుడుకు స్వస్తి చెప్పి అంతా పనులు చేసుకోవడంతో ఆర్థికంగానూ గట్టెక్కుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ మద్యం మహమ్మారిని గ్రామంలోకి అడుగు పెట్టనియ్యమని గ్రామస్థులంతా ముక్తకంఠంతో చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని