మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు: కేసీఆర్‌

రాష్ట్రంలో వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

Updated : 24 Sep 2022 15:19 IST

వరద ప్రభావంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
ప్రతి ఇంటికీ ఆహారం, దుప్పట్లు అందివ్వాలని ఆదేశం

హైదరాబాద్‌: రాష్ట్రంలో వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. బాధితులకు అవసరమైన బియ్యం, పప్పు, ఇతర సామగ్రి అందించాలని సూచించారు. భారీ వర్షాలు, వరద ప్రభావంపై సీఎం అత్యవసర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల పరంగా జరిగిన నష్టాన్ని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫున ప్రతి ఇంటికి ఆహారం, 3 దుప్పట్లు వెంటనే అందించాలని కేసీఆర్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ పరిధిలో సహాయ కార్యక్రమాల కోసం రూ.5కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆయన నిర్ణయించారు. మరోవైపు వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 50 మంది మృతిచెందారని.. మృతుల్లో హైదరాబాద్‌ పరిధిలో 11 మంది ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని.. ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్తగా మంజూరు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థికసాయం అందించాలని సూచించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 7.35లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు సీఎంకు చెప్పారు. వీటి నష్టం విలువ సుమారు రూ.2వేల కోట్లు ఉంటుందని అంచనా వేసినట్లు వివరించారు. హైదరాబాద్‌లో 1916 తర్వాత ఒకేరోజు ఇంత భారీగా వర్షం నమోదవడం ఇదే ప్రథమం అని.. దీనివల్ల చాలా కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరిందని అధికారులు సీఎంకు తెలిపారు. నగరంలోని మొత్తం 72 ప్రాంతాల్లోని 144 కాలనీల్లో సుమారు 20వేలకు పైగా ఇళ్లు నీటిలో చిక్కుకున్నాయని, అందులో 35వేల కుటుంబాలు ప్రభావితమైనట్లు అధికారులు వివరించారు. ముఖ్యంగా ఎల్బీనగర్‌, చార్మినార్‌, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌ జోన్లలో ఈ ప్రభావం అధికంగా ఉన్నట్లు చెప్పారు. నగరంలో 72 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని