Updated : 04 Jan 2021 19:12 IST

ఇక్కడ పర్యటకులే పోస్ట్‌మ్యాన్లు!

ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇప్పుడు ఠక్కున ఫోన్‌ కాల్‌ చేస్తాం. కానీ, ఒకప్పుడు ఉత్తరాలే దిక్కు. వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకునేందుకు ఉత్తరం రాసేవారు. పోస్టుమెన్‌ ఆ ఉత్తరాన్ని తీసుకెళ్లి దానిపై ఉన్న చిరునామాలో ఇచ్చేవారు. ప్రస్తుత కాలంలో ఈ ఉత్తరాలు, పోస్టాఫీసుల వినియోగం తగ్గిపోయింది. కానీ, ఓ ఐలాండ్‌లోని పోస్టాఫీస్‌ ఇప్పటికీ పనిచేస్తోంది. విచిత్రమేమిటంటే.. ఇక్కడి ప్రజలు, రాసే ఉత్తరాలను.. పర్యటకులే తీసుకెళ్లి డెలివరీ చేస్తుంటారు.

ఈక్వెడార్‌లోని గాలాపాగొస్‌ ద్వీప సమూహం.. వన్యప్రాణులు, జలాచరాలను చూసేందుకు ఇష్టపడే వారికి ఇది ప్రధాన పర్యటక ప్రాంతంగా చెబుతుంటారు. ఇక్కడ అడవి, సముద్ర వాతావరణం ఎంతో ఆకట్టుకుంటుంది. 25వేలకు పైగా జనాభా ఉన్న ఈ ఐలాండ్స్‌ పర్యటకంగా బాగా అభివృద్ధి చెందింది. అయితే ఈ ద్వీప సమూహంలోని ఫ్లోరెనా ఐలాండ్‌లో ఓ పోస్టాఫీస్‌ పర్యటకులను బాగా ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఇక్కడి ద్వీప సమూహంలో నివసించే ప్రజలు లేదా ఈ ఐలాండ్స్‌ను చూసేందుకు వచ్చిన పర్యటకులు రాసే ఉత్తరాలను ఇక్కడి పోస్టాఫీస్‌ బే వద్ద పెడితే.. తర్వాత వచ్చే పర్యటకులు వాటిని చూసి తమ ఇంటికి సమీప చిరునామాలతో ఉండే ఉత్తరాలను తీసుకెళ్లి స్వయంగా అందజేస్తారు. అందుకే ఈ లేఖలకు స్టాంప్‌ కూడా అక్కర్లేదు. 

ఈ పోస్టాఫీస్‌ బే చోటుకి ఓ చరిత్ర ఉంది. 18 శతాబ్దంలో అమెరికా, యూరప్‌ నుంచి తిమింగలాల వేటకు వెళ్తూ మత్స్యకారులు, సముద్ర వేటగాళ్లు మార్గమధ్యంలో ఈ గాలాపాగొస్‌ ఐలాండ్స్‌లో విశ్రాంతి తీసుకునేవారు. ఆహారం.. నీరు ఓడల్లో నింపుకొనేవారు. ఈ క్రమంలో చాలా కాలం ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చేది. దీంతో తమ క్షేమ సమాచారం వారి కుటుంబసభ్యులకు తెలపడం కోసం ఉత్తరం రాసి స్థానికంగా ఓ పీపాను ఏర్పాటు చేసి అందులో పెట్టేవారు. వారి తర్వాత ఎవరైనా నావికులు తిరుగు ప్రయాణంలో ఇక్కడికి వస్తే.. ఈ ఉత్తరాలను చూసి తమ ప్రాంతం సమీపంలోని చిరుమానాతో ఏవైనా ఉత్తరాలు ఉంటే తీసుకెళ్లి ఇచ్చేవారు. అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే పోస్టాఫీస్‌ బే అంటే కార్యాలయం ఏం ఉండదు. కేవలం విరిగిపోయిన స్తంభాలు, బల్లలు, కలప డబ్బాలు మాత్రమే ఉంటాయి. ఈ ఉత్తరాల విషయం పూర్తిగా నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. ఉత్తరాలు రాసేవారు ఎలాగైనా ఇవి గమ్యం చేరుకుంటాయని నమ్ముతూ ఇక్కడ పెడుతుంటారు. పర్యటకులు సైతం అంతే నమ్మకంగా వాటిని చేరాల్సిన చోటుకి చేరుస్తుంటారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని