PICS: పోటెత్తిన వరద.. గోదారమ్మ ఉగ్రరూపం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాల్లోకి భారీగా వరద నీటి ప్రవాహం ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. గడిచిన 24గంటల్లోనే శ్రీశైలం జలాశయంలోకి 8 ......

Updated : 17 Aug 2020 16:29 IST

ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాల్లోకి వరద నీటి ప్రవాహం ప్రమాదకరస్థాయిలో కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. గడిచిన 24 గంటల్లోనే శ్రీశైలం జలాశయంలోకి 8 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మరోవైపు, భద్రాచలం వద్ద గోదావరి మహోద్ధృతి కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో మరోసారి 60 అడుగులు నీటిమట్టం దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌ కూడా పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. మరోవైపు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వందలాది గ్రామాలు వరదనీటిలో చిక్కుకున్నాయి.

భద్రాద్రి ఏజెన్సీ అతలాకుతలం!
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఈ రోజు రాత్రి 9 గంటలకు 63 అడుగులకు చేరుతుందని సీడబ్ల్యూసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో ప్రస్తుతం 61 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీతో భద్రాద్రి ఏజెన్సీ అతలాకుతలమవుతోంది. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలకు ముంపు తీవ్రత అధికమైంది. ముంపు మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి వరదతో వేల ఎకరాల్లో పంటలకు అపార నష్టం జరిగింది. ఖమ్మం నుంచి భద్రాచలం రాకపోకలను అధికారులు అదుపు చేస్తున్నారు. భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది. భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు, భద్రాచలంలో వరద పరిస్థితిని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి పరిశీలించారు. గోదావరి లోతట్టు ప్రాంతమైన సుభాష్‌నగర్‌ కాలనీని సందర్శించారు. ఇళ్ల వద్దకు వరదనీరు చేరడంతో పునరావాస కేంద్రానికి వెళ్లాలని ప్రజలకు సూచించారు. 

వరద పరిస్థితిని సమీక్షిస్తున్న కలెక్టర్‌ ఎంవీ రెడ్డి


ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ 
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది నీటి ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 17.50 అడుగుల నీటి మట్టం ఉండగా.. సముద్రంలోకి 18.93లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. ఉభయగోదావరి జిల్లాలో వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.


నిండుకుండలా శ్రీశైలం జలాశయం
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి 2,88,608 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఇప్పటికే జలాశయానికి 1,57,913 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరింది. ప్రస్తుతం (మధ్యాహ్నం 3గంటలకు) జలాశయం నీటి మట్టం 872.40 అడుగులు; నీటి నిల్వ సామర్థ్యం 151.8195 టీఎంసీలుగా నమోదైనట్టు ఆనకట్ట అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు. మరోవైపు, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేసి 40259 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు. 


గరిష్ఠస్థాయిని మించిన హుస్సేన్‌ సాగర్‌
హుస్సేన్‌సాగర్‌లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే గరిష్ఠ స్థాయికి మించి నీటిమట్టం చేరింది. హైదరాబాద్‌ నగరానికి నడిబొడ్డున ఉన్న ఈ సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 513.41మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 513.50గా ఉంది. 


విద్యుత్‌ సరఫరాలో అంతరాయానికి టోల్‌ఫ్రీ నంబర్లు
వర్షాల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఛైర్మన్‌ రఘుమారెడ్డి పలు సూచనలు చేశారు. విద్యుత్‌ సంబంధిత ఫిర్యాదులకు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే 1912, 100కు ఫోన్‌ చేయాలని సూచించారు. కంట్రోల్‌ రూం నంబర్లు 738020 72104, 73820 72106, 73820 71574కు ఫోన్‌ చేయాలని విజ్ఞఫ్తి చేశారు. రోడ్లు భవనాలపై తెగిపడిన తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా విద్యుత్‌ తీగలు తెగిపడితే అధికారులకు  తెలపాలని.. అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లోకి నీరు చేరితే విద్యుత్‌ శాఖకు తెలియజేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని