స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ వాయిదా

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం ఏవైనా...

Published : 16 Nov 2020 14:06 IST

దిల్లీ: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం ఏవైనా అభివృద్ధి పనులు ఆపిందా? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా అభివృద్ధి పనులకు ఈసీ అనుమతి తీసుకోవాలని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిని సవరించాలంటూ ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. తదుపరి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ఈసీ ఓ నిర్ణయం తీసుకోలేదని దీని వల్ల అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోందని అన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో లేనప్పుడు ఈసీ అనుమతి ఎలా తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. ఎన్నికలు రద్దు చేయలేదని, వాయిదా మాత్రమే వేశామని ఈసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం అభివృద్ధి పనుల కోసం ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈసీ అనుమతి ఇవ్వకపోతే పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని చెప్పింది.. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని