మాస్కు పెట్టుకొంటున్నాం అనిపిస్తే సరిపోదు!

కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవలసిందే. ముఖ్యంగా బయటకు వచ్చినపుడు విధిగా మాస్క్‌ ధరించాలి. అయితే కొంతమందికి వీటిని ఎలా వాడాలన్న విషయంపై ఇప్పటికీ సరైన అవగాహన లేదు.

Published : 23 Nov 2020 22:09 IST


ఇంటర్నెట్‌ డెస్క్‌ : కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవలసిందే. ముఖ్యంగా బయటకు వచ్చినపుడు విధిగా మాస్క్‌ ధరించాలి. అయితే కొంతమందికి వీటిని ఎలా వాడాలన్న విషయంపై ఇప్పటికీ సరైన అవగాహన లేదు. ఇష్టారీతిన ధరిస్తున్నారు. ముక్కును వదిలేసి నోటికి మాత్రమే అడ్డుపెట్టుకుంటున్నారు. మరికొందరు నాణ్యతలేని వాటిని వాడుతున్నారు. రోజుల తరబడి ఒకే మాస్కును వినియోగిస్తున్నారు. వాడిన వాటిని పడేయటంలోనూ జాగ్రత్తలు పాటించటం లేదు. ఈ నేపథ్యంలో వాటి వాడకం ఎలా ఉండాలన్న దాని గురించి ఓ లుక్కేయండి.

కరోనా నుంచి రక్షణ కోసం మాస్కును ధరించటం ఎంత ముఖ్యమో..దానిని శుభ్రం చేయటమూ అంతే ముఖ్యం. అయితే ఒక మాస్కును రెండు, మూడు సార్లు వాడిన తరువాత గానీ శుభ్రం చేయకపోవటం, వాటి మీద శానిటైజర్‌ స్ప్రే చేయటం వంటివి చాలామంది చేస్తుంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. వాటిని ధరించటంలోనూ, శుభ్రం చేయటంలోనూ తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ శుభ్రం చేయాలి. అలా కాకుండా వారానికోసారి శుభ్రం చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు ప్రమాదంలోకి నెట్టుకుంటున్నట్లే. కొంతమంది మాస్కులపై క్రిమి సంహారకాలను పోస్తారు. ఇవి వైరస్‌ను చంపుతాయి. కానీ...మాస్క్‌ ధరించాక శ్వాస తీసుకునేటప్పుడు వాటి వాసన ఇబ్బందిగా అనిపిస్తుంది. అంతేకాదు ముక్కు, నోరు, దవడల దగ్గర చర్మంపై దురద కలగటం, మంటగా అనిపిస్తుంది. మాస్కులను వేడినీటితో శుభ్రం చేయాలి. వస్త్రంతో చేసిన వాటిని వాషింగ్‌ మెషీన్లో‌ వేడినీరు లేదా సబ్బుతో కనీసం ఇరవై సెకన్ల పాటు శుభ్ర పరచాలి. తరువాత ఎండలో లేదా డ్రైయ్యర్‌ను హై హీట్‌ మోడ్‌లో ఉంచి ఆరబెట్టాలి. వాడిన మాస్కులను పడేయాల్సి వస్తే జాగ్రత్తగా పేపర్‌లో పెట్టి చెత్తబుట్టలో వేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని