Trees: మొక్కలపై ఎంత ప్రేమో! ఇంటిని.. కాలేజీని పచ్చదనంతో నింపేశాడు

నగరీకరణ, అభివృద్ధి పేరుతో ఎన్నో ఏళ్లుగా ప్రజలకు నీడని.. ప్రాణవాయువును అందిస్తున్న చెట్లను నిర్దాక్ష్యంగా నరికేస్తున్న రోజులివీ. అలాంటిది.. ఏదో ఒక మొక్కని నాటి ప్రయత్నిద్దామని మహారాష్ట్రకి చెందిన గణేశ్‌ కులకర్ణి ఇంటికి ఒక గులాబీ మొక్కను తెచ్చి నాటాడు. ప్రతి రోజు నీరు పోస్తున్నా.. పూలు పూయడం కాదు.. ఏకంగా మొక్కే వాడిపోయింది. ఓ చెట్టు ప్రాణం

Published : 05 Aug 2021 23:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నగరీకరణ, అభివృద్ధి పేరుతో ఎన్నో ఏళ్లుగా ప్రజలకు నీడని.. ప్రాణవాయువును అందిస్తున్న చెట్లను విచాక్షణారహితంగా నరికేస్తున్న రోజులివీ. అలాంటిది.. మహారాష్ట్రకి చెందిన గణేశ్‌ కులకర్ణి తన ఇంట్లో ఒక మొక్క చనిపోయిందని, ఏకంగా మొక్కల ఉద్యమమే ప్రారంభించాడు. ఒక్క మొక్క ప్రాణం పోయినందుకు వందలకొద్ది మొక్కలను తెచ్చి తన ఇంటి టెర్రస్‌పై పెంచుకుంటున్నాడు. తను పనిచేసే కాలేజీ మొత్తాన్ని పచ్చదనంతో నింపేశాడు. అంతేనా, తన సన్నిహితులు.. కాలనీవాసులకు మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తూ.. వారితో మొక్కలు నాటిస్తున్నాడు.

గణేశ్‌.. ఔరంగాబాద్‌లో లైబ్రెరియన్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ఒక గులాబీ మొక్కను తెచ్చి ఇంట్లో నాటాడు. ప్రతి రోజు నీరు పోస్తున్నా.. పూలు పూయడం కాదు, ఏకంగా మొక్కే వాడిపోయింది. ఓ మొక్క ప్రాణం తీశానన్న అపరాధభావంతోపాటు మొక్కలను పెంచే పద్ధతి అది కాదని తెలుసుకున్న గణేశ్‌.. వాటి పెంపకంపై మరింత శ్రద్ధ పెట్టాడు. అసలు చెట్లను ఎలా పెంచాలో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. చాలా మందికి మొక్కలు నాటి.. నీరు పోయడం వరకే తెలుసు. కానీ, వాటిని ఏ విధంగా పెంచాలో తెలియదు. అందుకే, గణేశ్‌ ఇంటర్నెట్‌ను ఆశ్రయించాడు. మొక్కలు, గార్డెనింగ్‌పై ఆన్‌లైన్‌ కోర్సులు చేశాడు. సోషల్‌మీడియాలో గార్డెనింగ్‌ గ్రూపుల్లో చేరి నిపుణులు, చెట్ల ప్రేమికులు ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకున్నాడు. అలా తన ఇంటి టెర్రస్‌పై 400కుపైగా మొక్కలు పెంచుతున్నాడు.

గణేశ్‌ మొక్కలను పెంచుతున్న తీరు.. మొక్కలను పెంచడంలో గణేశ్‌కు కలుగుతున్న ఆనందాన్ని చూసి అతడి బంధువులు, స్నేహితులు, కాలనీవాసులు కూడా మొక్కలను పెంచడానికి ఆసక్తి కనబర్చారు. దీంతో వాట్సాప్‌ గ్రూపులు ప్రారంభించి.. వారందరినీ సభ్యులుగా చేర్చాడు. మొక్కల పెంపకంలో వారికి కలిగే సందేహాలకు సమాధానం ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు. అతడి వాట్సాప్‌ గ్రూపుల్లో 1500 మందికి పైగా సభ్యులున్నారు.

అభిరుచి కాస్త ఉద్యమమైంది

ఇటీవల గణేశ్‌ మరో ఇంటికి మారాడు. తనతోపాటు తను పెంచుకున్న మొక్కలను వెంట తెచ్చుకున్నాడు. ఈ కొత్త ఇల్లు పెద్దగా ఉండటంతో అతడికి మొక్కలతోపాటు కూరగాయాలు కూడా పండించాలన్న ఆలోచన తట్టింది. అయితే.. మొక్కలను మట్టికుండల్లో పెంచొచ్చు. కానీ, కూరగాయలను పండించడం అంత ఈజీ కాదు. అందుకే, దానికి అనువైన వాతావరణం కల్పించడం కోసం ఇంట్లో అనేక మార్పులు, మరమ్మతులు చేయించాడు. రాను రాను గణేశ్‌ అభిరుచి ఒక ఉద్యమంగా మారింది. ఈ క్రమంలో చెట్ల పెంపకమే ధ్యేయంగా గ్రీన్‌ ట్రస్టు ఏర్పాటు చేశాడు. తను ఉద్యోగం చేస్తున్న సంత్‌ సవ్‌తామాలి గ్రామీణ్ మహా విద్యాలయంలో 4 ఎకరాల స్థలంలో, కాలేజీ ఆవరణలో 2 వేలకుపైగా మొక్కలు, చెట్లు పెంచుతున్నాడు. అలా తన ఇంటిని.. కాలేజీని ఉద్యానవనంగా మార్చేశాడు. మొక్కల పెంపకంలో తనకు ఆన్‌లైన్‌లో ఎంతో మంది సహాయం చేశారని, తను కూడా ఎవరైనా మొక్కలు పెంచుతామంటే ప్రోత్సాహిస్తానని, వారికి కావాల్సిన సాయం చేస్తానని గణేశ్‌ చెబుతున్నాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని