వందలాది శునకాలకు ఇంట్లో ఆశ్రయమిచ్చాడు!

ప్రకృతి వైపరిత్యాలు చెప్పిరావు. భూకంపం, సునామీ, సుడిగాలులు, కొండచరియలు విరిగిపడటం ఇలాంటివి ఏ క్షణానైనా జరగొచ్చు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనుషులంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తుంటారు. కానీ, వీధుల్లో తిరిగే జంతువుల గురించి ఎవరూ పట్టించుకోరు. అయితే మెక్సికోకి చెందిన ఓ వ్యక్తి మాత్రం

Published : 10 Oct 2020 02:04 IST


(ఫొటో: రికార్డో పెమెంటెల్‌ ఫేస్‌బుక్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావు. భూకంపం, సునామీ, సుడిగాలులు, కొండచరియలు విరిగిపడటం ఇలాంటివి ఏ క్షణాన్నైనా జరగొచ్చు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనుషులంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తుంటారు. కానీ, వీధి జంతువుల గురించి ఎవరూ పట్టించుకోరు. అయితే మెక్సికోకి చెందిన ఓ వ్యక్తి మాత్రం సుడిగాలులు విరుచుకు పడుతున్న వేళ వందలాది శునకాలకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించి మూగ జీవాలపట్ల తన ప్రేమను చాటుకుంటున్నాడు.

రికార్డో పెమెంటెల్‌ జంతు ప్రేమికుడు. జంతువుల హక్కుల కోసం పోరాడుతున్నాడు. ఈ నేపథ్యంలో వీధుల్లో తిరిగే శునకాల్ని తీసుకొచ్చి ఓ ఆశ్రమం ఏర్పాటు చేసి వాటిని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల మెక్సికోలోని క్వింటానా రూలో భారీ సుడిగాలి వచ్చి అల్లకల్లోలం సృష్టించింది. దీంతో గాలి ధాటికి శునకాల ఆశ్రమం ధ్వంసం అయ్యే అవకాశముందని గుర్తించాడు. సుడిగాలుల నుంచి జంతువులను కాపాడాలని భావించిన పెమెంటెల్‌ వేరేచోట ఆశ్రయం పొందుతున్న మూడు వందలకు పైగా శునకాలు, పిల్లులు, కోళ్లు, కుందేళ్లను తన ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. అనుకున్నట్లుగానే శునకాల ఆశ్రమం బాగా దెబ్బతింది. దీంతో తిరిగి ఆశ్రమం నిర్మించే వరకు వాటిని తన ఇంట్లోనే పెంచుకుంటాడట. వాటి పోషణ కోసం దాతలు ఎవరైనా విరాళాలు ఇవ్వొచ్చని కోరుతున్నాడు. పెమెంటెల్‌ ఇంట్లోకి వీధి శునకాలు వస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆపద వేళ తన స్వార్థం చూసుకోకుండా శునకాలకు ఆశ్రయం కల్పించిన పెమెంటెల్‌ను అక్కడి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని