Amit Shah: దేశంలో ప్రసిద్ధ క్షేత్రంగా సమతా కేంద్రం: అమిత్‌ షా

ముచ్చింతల్‌లో ఏడో రోజు సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు.

Updated : 08 Feb 2022 20:10 IST

హైదరాబాద్‌: ముచ్చింతల్‌లో ఏడో రోజు సమతామూర్తి సహస్రాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రం విశిష్టతను చినజీయర్‌ స్వామి హోం మంత్రికి వివరించారు. శ్రీరామనగరంలోని 108 దివ్య దేశాలను అమిత్‌ షా, బండి సంజయ్‌ దర్శించుకున్నారు. సెల్ఫ్‌ గైడ్‌ టూల్‌ ద్వారా దివ్య దేశాల విశిష్టత తెలుసుకున్నారు. సమతామూర్తి కేంద్రంలో  ప్రివ్యూ థియేటర్‌ను అమిత్‌ షా ప్రారంభించారు.

ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ... ‘‘2003లోనే చినజీయర్‌ స్వామితో పరిచయం ఏర్పడింది. గుజరాత్‌ భూకంప బాధితులకు సాయం చేశారు. ఆయన మర్యాద చూస్తే మనసు ఉప్పొంగింది. చిన్న వాళ్లనైనా ఎంతో గౌరవిస్తారు. కులం, మతం, జాతి భేదం లేకుండా అందరూ సమతామూర్తిని దర్శించుకోవాలి. జీవితంలో ఒక్కసారైనా ఆయన దర్శనం చేసుకోవాలి. రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే సమతా సూత్రం బోధించారు. రామానుజుడి బోధనలు దేశం నలుమూలలకు ప్రసరించాయి. శంకరాచార్యులు కూడా సనాతన ధర్మాన్ని కాపాడారు. దేశంలో ప్రసిద్ధ క్షేత్రంగా సమతా కేంద్రం ఖ్యాతి గడిస్తుంది. ముచ్చింతల్‌ రావడం అదృష్టంగా భావిస్తున్నా. చినజీయర్‌ స్వామి ఓ గ్రామాన్ని పునర్నిర్మించారు. హిందుత్వం జీవనది లాంటిది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ ప్రవాహం ఆగదు. రామానుజాచార్యులు 120 ఏళ్లు జీవించారు. మనిషి 60 ఏళ్లు జీవిస్తే సంపూర్ణంగా భావించే రోజుల్లో 120 ఏళ్లు జీవించారు.  ఆయన రాసిన 9 గ్రంథాలు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. అన్ని జీవులకు మోక్షం అవసరమని ఆయన చెప్పారు. వేదాల్లో చెప్పినట్టే రామానుజాచార్యులు జీవించి చూపారు’’ అని అమిత్‌ షా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని