AP High Court: గవర్నర్‌కు ఉద్యోగుల ఫిర్యాదు అంశంపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్‌

రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఉద్యోగులపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

Updated : 31 Jan 2023 14:55 IST

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఉద్యోగులపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. వేతనాలు, ఇతర బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ కొద్దిరోజుల క్రితం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. గవర్నర్‌కు ఉద్యోగులు ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలను విరుద్ధమని.. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీనిపై ఆ సంఘం నేతలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఇరువురి వాదనలు విని తీర్పును రిజర్వ్‌చేసింది. తుది తీర్పు ఇచ్చేంత వరకు షోకాజ్‌ నోటీసు ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు, ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది.

పెండింగ్‌ బిల్లులపై స్పందించాలి: సూర్యనారాయణ

పెండింగ్‌ బిల్లులపై ప్రభుత్వం స్పందించాలని ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. చెల్లింపు విషయంలో ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించాలని కోరారు. ఉద్యోగులు సంక్షేమం కోసం ఐక్య ఉద్యమాలకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 2న పెండింగ్‌ బిల్లులు.. చట్టబద్ధతపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని సంఘాలతో మాట్లాడుతున్నామని అన్నారు. పీఎఫ్‌ఎంఎస్‌వద్ద రూ.12వేల కోట్ల మేర బకాయిలున్నాయని చెప్పిన ఆయన.. అధికారులను వివరాలు అడిగినా చెప్పట్లేదని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని