Andhra News: కొత్త పీఆర్సీ నియామకంపై త్వరలోనే నిర్ణయం: బొత్స

సీపీఎస్‌కు చట్టబద్ధత లేదన్న అంశంపై ఎవరో మాట్లాడితే స్పందించలేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతలతో అనధికార సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 

Published : 27 Apr 2023 20:14 IST

అమరావతి: సీపీఎస్‌కు చట్టబద్ధత లేదన్న అంశంపై ఎవరో మాట్లాడితే స్పందించలేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నేతలతో అనధికార సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో సీపీఎస్‌ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌, డీఏ బకాయిలపై చర్చించామని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలపై మే 1 నుంచి జీవోలు జారీ చేస్తామని చెప్పారు. కొత్త పీఆర్సీ నియామకంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాలు సామరస్యంగా ప్రవర్తించాలని కోరారు. ప్రభుత్వానికి ఎవరిపైనా వివక్ష ఉండదని.. ఉద్యోగులంతా తమ కుటుంబసభ్యులే అని బొత్స తెలిపారు.

రూ.1800 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించలేదు: బొప్పరాజు

ఉద్యోగులకు సంబంధించిన డబ్బుని మాత్రమే ప్రభుత్వం చెల్లించిందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టబద్ధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.1800 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించలేదని, అవి ఎప్పుడు చెల్లిస్తారో తెలియదన్నారు. పీఆర్సీ అరియర్స్‌ కూడా ఎంత ఇవ్వాలో లెక్కలు చూస్తామని అధికారులు చెప్పారని తెలిపారు. రూ.4కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని కొత్త పేస్కేల్స్‌ ఆమోదం నిలిపివేస్తారా? అని ప్రశ్నించారు. పోలీసుల, వైద్యశాఖలో పనిచేస్తున్న వారికి ఇచ్చే స్పెషల్‌ పే లకు కాలపరిమితి వద్దని చెప్పామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. 

కొత్త జిల్లా కేంద్రాల్లో 16శాతం హెచ్‌ఆర్‌ఏ ఉత్తర్వులు ఇవ్వాలని కోరామని తెలిపారు. సాధారణ బదిలీలు, వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలపైనా త్వరలోనే నిర్ణయానికి వస్తామని మంత్రుల కమిటీ చెప్పిందని వివరించారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే వరకూ తమ ఉద్యమ కార్యాచరణ ఆపేది లేదని స్పష్టం చేశారు. రేపు జరగాల్సిన రౌండ్ టేబుల్ సమావేశం యదావిధిగా కొనసాగుతుందన్నారు. తమ ఉద్యమ ఫలితంగానే రూ.5,860 కోట్ల బకాయిలు ఇచ్చారని బొప్పరాజు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని