Andhra News: పాలు, కూరగాయల వాళ్లకీ ఉద్యోగులు లోకువయ్యే పరిస్థితి: బండి శ్రీనివాసరావు

రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు చెల్లించాకే ఐఏఎస్‌లకు ఇస్తామని నోటిమాటగా చెప్పడమే కానీ అది అమల్లో లేదని ఏపీ ఎన్జీవో సంఘం నేత బండి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ 62 ఏళ్ల ఉద్యోగ విరమణ వయసు వర్తింపజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated : 16 Dec 2022 15:36 IST

విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూలి కన్నా దారుణంగా ఉందని ఏపీ ఎన్జీవో సంఘం నేత బండి శ్రీనివాసరావు అన్నారు. పాలు, కూరగాయలు, బ్యాంకుల వాళ్ల దగ్గర కూడా ఉద్యోగులు లోకువయ్యే పరిస్థితిని ప్రభుత్వం కల్పించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘ఏ ప్రభుత్వంతోనూ ఉద్యోగ సంఘాలకు లాలూచీ లేదు. ఉద్యోగుల ఉద్యమాన్ని ఎప్పుడూ నేతలు తాకట్టు పెట్టలేదు. ఉద్యోగులు నెలంతా పనిచేస్తే 30న జీతం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. ఒక్క నెల జీతం రాకపోతేనే ఇబ్బందులు పడతాం.. అలాంటిది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు బకాయిలు పెడితే ఎలా? ఉద్యోగులకు జీతాలు చెల్లించాకే ఐఏఎస్‌లకు ఇస్తామని నోటిమాటగా చెప్పడమే కానీ అది అమల్లో లేదు. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ 62 ఏళ్ల ఉద్యోగ విరమణ వయసు వర్తింపజేయాలి. గ్రామ సచివాలయ ఉద్యోగులకూ బదిలీ ప్రక్రియ చేపట్టాలి. జీపీఎఫ్‌ నిధులను ఉద్యోగులకు ఇవ్వకుండా ప్రభుత్వం వాడుకోడమేంటి? సామాజిక పింఛన్లను ఒకటో తేదీనే ఇస్తున్న ప్రభుత్వం.. పెన్షనర్లకు కూడా అదే ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని