Bhumana Karunakar Reddy: ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలు అలజడి సృష్టించేందుకే: భూమన

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

Updated : 05 Nov 2023 16:03 IST

తిరుమల: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై భూమన స్పందించారు. తితిదే ఛైర్మన్‌గా, ఓ నేతగా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు సమాజంలో అలజడి సృష్టించడానికి తప్ప దేనికీ పనికిరావన్నారు.

ఎల్‌కేజీ నుంచి పీజీ విద్యార్థులకు కోటి భగవద్గీత పుస్తకాల పంపిణీ

సనాతన ధర్మం వ్యాప్తికి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు భూమన చెప్పారు. యువత, నేటితరం చిన్నారుల్లో భక్తిభావన పెంపొందించే లక్ష్యంతో గోవిందకోటి రాసేలా ప్రోత్సహించాలని నిర్ణయించామన్నారు. 

‘‘ఎల్‌కేజీ నుంచి పీజీ చదివే విద్యార్థులకు శ్రీవారి పుస్తక ప్రసాదంగా కోటి భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేయాలని నిర్ణయించాం. 25 ఏళ్లలోపు గోవిందకోటి రాసిన భక్తులకు వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తాం. అధిక మాసం నేపథ్యంలో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 18న స్వామి వారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పిస్తారు. తితిదేలో 413 కొత్త పోస్టుల నియామకాల అనుమతి కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. 

తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలను తొలగించి వసతి సముదాయాలను నిర్మించాలని నిర్ణయించాం. రూ.600 కోట్లతో 20వేల మందికి వసతి కల్పించేలా సముదాయాలు నిర్మించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ముంబయిలో శ్రీవారి రెండో ఆలయ నిర్మాణానికి రూ.1.65కోట్లు.. సమాచార కేంద్రం ఏర్పాటుకు రూ.5.35లక్షలు కేటాయిస్తున్నాం’’ అని భూమన వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని