Andhra News: ఆందోళన వద్దు.. మణిపుర్‌ నుంచి విద్యార్థులను తీసుకొస్తాం: బొత్స

మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో అక్కడ చదువుతున్న ఏపీకి చెందిన నిట్‌, ఐఐటీ, సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులందరినీ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Updated : 07 May 2023 19:50 IST

విజయనగరం: మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో అక్కడ చదువుతున్న ఏపీకి చెందిన నిట్‌, ఐఐటీ, సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులందరినీ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆదివారం విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఇప్పటికే 100 మంది విద్యార్థుల జాబితా సిద్దం చేశామని, మరో 50 మంది వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. వారి వివరాలు సేకరించేందుకు దిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసినట్టు మంత్రి వెల్లడించారు.

మణిపుర్‌లో చోటు చేసుకున్న ఘటనల కారణంగా ఆ ప్రాంతంలో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులను తీసుకొచ్చేందుకు శనివారం నుంచే చర్యలు చేపట్టామని తెలిపారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి.. బాధిత విద్యార్థుల జాబితా రూపొందించామన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రితో మాట్లాడి.. విద్యార్థులందర్నీ రాష్ట్రానికి రప్పించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థుల కోసం హెల్ప్‌ లైన్‌ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. బాధిత విద్యార్థులు హిమాన్ష్‌ కౌశిక్‌, ఏపీ భవన్‌ 8800925668, రవిశంకర్, ఏపీ భవన్ ఓఎస్డీ  9871999055 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. వివరాలు నమోదు చేసుకుంటే వాళ్లని కూడా సొంత ప్రాంతాలకు తీసుకొచ్చే ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని