Anand Mahindra: ‘అతడు మానవ సెగ్వే’.. ధోబీపై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

ధోబీపై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. తలపై భారీ మూటతో వ్యాండిల్‌ను పట్టుకోకుండా సైకిల్‌ను అతడు నియంత్రిస్తున్న విధానానికి ముగ్ధుడయ్యారు.......

Published : 30 Mar 2022 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వంపులు తిరిగిన సన్నని రోడ్డు.. తలపై పెద్ద దుస్తుల మూటతో ఓ వ్యక్తి సైకిల్‌ను స్పీడ్‌గా తొక్కుతున్నాడు. కానీ అతడి చేతులు సైకిల్‌ హ్యాండిల్‌పై లేవు.. తలపై ఉన్న మూటను రెండు చేతులతో పట్టుకొని హ్యాండిల్‌ను పూర్తిగా వదిలేసి అతడు సైకిల్‌ను నడుపుతున్న తీరు సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. ఎలాంటి తడబాటు లేకుండా.. సైకిల్‌ను నియంత్రిస్తూ రోడ్డు వంపులను అలవోకగా దాటుకుంటూ వెళ్లే ఆ ధోబీ తీరు నెటిజన్లను అబ్బరపరుస్తోంది. ఆ సైకిల్‌ వెనకే కారులో వెళ్లే మరో వ్యక్తి ఈ వీడియోను తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

కాగా ఈ వీడియో కాస్తా  సోషల్‌ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా కంట్లో పడింది. దీంతో ఆయన ఈ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసి.. ఆ ధోబీపై ప్రశంసలు కురిపించారు. తలపై భారీ మూటతో వ్యాండిల్‌ను పట్టుకోకుండా సైకిల్‌ను అతడు నియంత్రిస్తున్న విధానానికి ముగ్ధుడయ్యారు. అతడి శరీరంలో జైరోస్కోప్‌ (చక్రం లేదా డిస్క్‌తో కూడిన పరికరం) ఉందా! అంటూ ఆశ్చర్యపోయారు.

‘ఈ వ్యక్తి దేహంలో జైరోస్కోప్‌ ఉందా! అతడు మానవ సెగ్వే. సైకిల్‌ను అతడు నియంత్రిస్తున్న విధానం అద్వితీయం. అయినప్పటికీ, నాకు బాధ కలిగించే విషయం ఏమిటంటే.. మన దేశంలో అతనిలాంటి చాలా మంది ప్రతిభావంతులైన జిమ్నాస్ట్‌లు / క్రీడాకారులు ఉన్నారు. కానీ వారికి గుర్తింపు, శిక్షణ లభించడం లేదు’ అంటూ ట్వీట్‌ చేశారు. మహీంద్రా పంచుకున్న ఈ వీడియో వైరల్‌గా మారింది. ఆ ధోబీ ప్రతిభను అనేకమంది మెచ్చుకుంటున్నారు. ఆ వీడియోను ఇప్పటికే 6.7లక్షల మంది వీక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని