Dhaka: నన్ను కాపాడండి.. పోలీసులకు దొంగ ఫోన్‌..!

సాధారణంగా దొంగతనాల కేసుల్లో బాధితులు.. పోలీసులను ఆశ్రయిస్తుంటారు. కానీ.. బంగ్లాదేశ్‌లో మాత్రం చోరీకి వచ్చిన వ్యక్తే పోలీసులకు ఫోన్‌ చేసి మరీ లొంగిపోవడం గమనార్హం. కారణం.. అప్పటికే జనాలు తనను గుర్తించడంతో ఎక్కడ  కొడతారోనన్న భయమే.

Published : 22 Oct 2022 01:40 IST

ఢాకా: సాధారణంగా దొంగతనాల కేసుల్లో బాధితులు.. పోలీసులను ఆశ్రయిస్తుంటారు. కానీ.. బంగ్లాదేశ్‌(Bangladesh)లో మాత్రం చోరీకి వచ్చిన వ్యక్తే పోలీసులకు ఫోన్‌ చేసి మరీ లొంగిపోవడం గమనార్హం. పోలీసుల వివరాల ప్రకారం.. యాసిన్‌ ఖాన్‌ అనే వ్యక్తి స్థానికంగా తరచూ దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలోనే అతడు బుధవారం తెల్లవారుజామున ఇక్కడి దక్షిణ బరిసాల్‌ నగరంలోని ఓ పెద్ద కిరాణా దుకాణంలోకి చొరబడ్డాడు. లోపలంతా సామాన్లు మూటగట్టుకుని బయటపడే సమయానికి.. తెల్లారిందని గుర్తించాడు. అప్పటికే మార్కెట్‌లో జనాల సందడి పెరిగింది. ఈ క్రమంలోనే యాసిన్‌ కదలికలను గమనించిన స్థానికులు.. ఒక్కసారిగా పెద్దమొత్తంలో గుమిగూడారు.

దీంతో ఎక్కడ తనపై దాడికి పాల్పడతారోనన్న భయంతో అతడు వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి.. తనను కాపాడాలంటూ వేడుకున్నాడు. ఈ క్రమంలోనే వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారి అసద్‌ జమాన్‌ వెల్లడించారు. తన జీవితంలో ఇంతవరకు ఇటువంటి ఘటనను చూడలేదని ఆయన తెలిపారు. నిందితుడు విలువైన వస్తువులతో పెద్ద బ్యాగ్‌ నింపాడని, అయితే దుకాణం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడని యజమాని ఓ వార్తాసంస్థకు చెప్పారు. చోరీకి పాల్పడినట్లు అంగీకరించడంతో.. యాసిన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో జరిగిన ఇతర చోరీ ఘటనల్లోనూ అతని హస్తం ఉందని, అప్పటినుంచి తప్పించుకు తిరుగుతున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని