Chandrababu: అమర్నాథ్‌ కుటుంబానికి తెదేపా రూ.10లక్షలు సాయం: చంద్రబాబు

దారుణ హత్యకు గురైన అమర్నాథ్‌ కుటుంబసభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించారు.

Updated : 19 Jun 2023 21:07 IST

రేపల్లె: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం ఉప్పలవారిపాలెంలో దారుణ హ్యతకు గురైన పదో తరగతి విద్యార్థి అమర్నాథ్‌ కుటుంబీకులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి తెదేపా తరఫున రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించారు. అమర్నాథ్‌ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. తొలుత చంద్రబాబును చూసి అమర్నాథ్‌ కుటుంబసభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అమర్నాథ్‌ హత్య ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు వస్తున్నారని తెలిసి అమర్నాథ్‌ నివాసం వద్దకు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘అమర్‌నాథ్ హత్య బాధాకరమైన సంఘటన. బంగారు భవిష్యత్తు ఉన్న విద్యార్థిని పొట్టన పెట్టుకున్నారు. తన సోదరిని వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు చంపేశారు. అమర్‌నాథ్ బంధువులు అంబులెన్స్ కోరినా పోలీసులు సమకూర్చలేదు. బాలుడు మరణించిన తర్వాత కూడా పోలీసులు స్పందించలేదు. హత్య చేసిన నేరస్తులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి బాలుడిపై ఎదురు కేసు పెట్టడానికి ప్రయత్నించారు. ఇంతటి ఘటన జరిగితే ముఖ్యమంత్రి కనీసం ఇక్కడకు రాలేదు. హత్య జరిగిన తర్వాత ఎంపీ వచ్చి లక్ష రూపాయలు చేతిలో పెట్టి మౌనంగా ఉండాలని చెబుతారు. ఇవాళ మచిలీపట్నంలో హాస్టల్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఇలాంటివి జరిగినప్పుడు మాట్లాడితే రాజకీయాలు అంటారా? ఆడబిడ్డకు అండగా నిలవటం శవ రాజకీయం అవుతుందా?అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకోకపోతే బాధితులపైనే ఎదురు కేసు పెట్టేవారు.

రాష్ట్రంలో ఎటు చూసినా గంజాయి, గన్ సంస్కృతి వచ్చింది. అమ్మాయిలను చదువుకోవడానికి పంపాలంటే భయపడే పరిస్థితి. అమర్‌నాథ్ కుటుంబానికి పార్టీ తరఫున రూ10 లక్షలు సాయం చేశాం. కానీ అమర్‌నాథ్ సోదరికి ఈ రూ.పది లక్షలు ధైర్యాన్నివ్వలేవు. రాష్ట్రంలో గంజాయి, నేర సంస్కృతి పోతేనే అమ్మాయిలకు రక్షణ ఉంటుంది. వైకాపా అరాచకాలు ప్రశ్నిస్తే తెదేపా కార్యాలయంపై దాడి చేశారు. ఇవాళ అమర్‌నాథ్ సోదరికి ధైర్యం చెప్పడానికి వచ్చాను. ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోనే యువతిని సామూహిక అత్యాచారం చేశారు. ఇప్పటివరకూ వారికి శిక్ష పడలేదు. నేను సీఎంగా ఉండగా పల్నాడులో ఇలాంటి ఘటన జరిగితే వెంటనే స్పందించా. పోలీసులకు భయపడి నిందితుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమర్‌నాథ్ సోదరి బాగా చదివి ఇలాంటి వెధవలకు బుద్ధి చెప్పాలి. అమ్మాయి కూడా చదువుకుంటానని చెప్పింది. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున అమ్మాయిని దత్తత తీసుకుంటున్నా. అమర్‌నాథ్‌ సోదరిని చదివించే బాధ్యత నేను తీసుకుంటా. రాష్ట్రంలో ఆడబిడ్డల్ని కాపాడే బాధ్యత తెదేపా తీసుకుంటుంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని