WMO: ప్రకృతి వైపరీత్యాలతో భారత్‌కు రూ. 6లక్షల కోట్ల నష్టం

అకాల వర్షాలు, వరదలు, తుపానులకు తోడు కరవు రక్కసి కారణంగా భారత్‌ ఏటా లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.....

Updated : 27 Oct 2021 01:23 IST

దిల్లీ: ప్రకృతి వైపరీత్యాలు భారత్‌కు భారీ నష్టాలను మిగుల్చుతున్నాయి. అకాల వర్షాలు, వరదలు, తుపానులకు తోడు కరవు రక్కసి కారణంగా ఏటా లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. గతేడాది ప్రకృతి ప్రకోపానికి భారత్ దాదాపు రూ. 6 లక్షల కోట్ల మేర నష్టపోయినట్లు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తాజా నివేదికలో వెల్లడించింది. వర్షాలు, వరదల కారణంగా భారత్‌లో లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నట్లు పేర్కొంది. వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో ఈ నెల 31న కాప్‌26 శిఖరాగ్ర సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ నివేదిక వెలువడటం గమనార్హం.

కరవు కారణంగానే అధిక నష్టం

ప్రకృతి వైపరీత్యాలతో మన దేశం గతేడాది రూ.6,52,500 కోట్ల మేర నష్టపోయినట్లు డబ్ల్యూఎంఓ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆసియాలోని వాతావరణ పరిస్థితులమీద ‘స్టేట్‌ ఆఫ్‌ ది క్లైమేట్‌ ఇన్‌ ఆసియా’ పేరుతో డబ్ల్యూఎంఓ విడుదల చేసిన నివేదికలో ఈ కఠోర వాస్తవాలు వెలుగుచూశాయి. తుపానులు, రుతుపవనాల కారణంగా సంభవించే భారీ వర్షాలు, వరదలకు తోడు కరవు వంటి ప్రకృతి విపత్తులతో భారత్‌ ఏటా లక్షల కోట్ల మేర నష్టపోతోందంటూ ‘యునైటెడ్‌ నేషన్స్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ కమిషన్‌ ఫర్‌ ఆసియా అండ్‌ పసిఫిక్‌’ సంస్థ వేసిన అంచనాలను సైతం ఈ నివేదికలో ప్రస్తావించింది. ప్రకృతి విపత్తులతో గతేడాది చైనా 238 బిలియన్‌ డాలర్ల మేర నష్టపోగా.. భారత్‌కు 87 బిలియన్‌ డాలర్లు, జపాన్‌కు 83 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వాటిల్లినట్లు ఈ నివేదిక తెలిపింది. ప్రకృతి విపత్తుల్లో.. కరవు కారణంగానే అధిక నష్టం సంభవిస్తున్నట్లు వెల్లడించింది.

నిరాశ్రయులైన 24 లక్షల మంది

2020 మే నెలలో వచ్చిన అంపన్‌ తుపాను కారణంగా భారత్‌లోని సుందర్బన్‌ ప్రాంతం, బంగ్లాదేశ్‌ తీవ్రంగా నష్టపోయినట్లు ఈ నివేదిక పేర్కొంది. భారత్‌లో 24 లక్షల మంది, బంగ్లాదేశ్‌లో 25 లక్షల మంది నిరాశ్రయులైనట్లు వెల్లడించింది. గతేడాది వర్షాలు, వరదలు దక్షిణాసియా, తూర్పు ఆసియా ప్రాంతాలను తీవ్రంగా ముంచెత్తాయన్న నివేదిక.. ఈ విపత్తుల ఫలితంగా భారత్‌, చైనా, బంగ్లాదేశ్‌, జపాన్‌, పాకిస్థాన్‌, నేపాల్‌, వియత్నాం దేశాల్లో లక్షలాది మంది నిరాశ్రయులైనట్లు వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని