CM Jagan: రాజధాని అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలి: జగన్‌

సీఆర్డీఏ ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అనంతరం వేగంగా నిర్మాణ పనులు ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

Updated : 18 May 2023 17:38 IST

తాడేపల్లి: రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఇళ్లపట్టాల పంపిణీ అనంతరం వేగంగా ఇళ్ల నిర్మాణం సాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం గృహనిర్మాణశాఖపై సీఎం సమీక్షించారు. సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సీఆర్డీఏ ప్రాంతంలో పేదలకు పట్టాల పంపిణీ చేసిన అనంతరం వేగంగా ఇళ్ల నిర్మాణ పనులు ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ చేయాలన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

రాష్ట్రంలో గృహనిర్మాణాలపైనా సీఎం ఆరా తీశారు. నవరత్నాల్లో భాగంగా ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. గడచిన 45 రోజుల్లో హౌసింగ్‌ కోసం రూ.1,085 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకూ 3.70 లక్షల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. 5.01లక్షల ఇళ్లు రూఫ్‌ లెవల్, ఆపైన నిర్మాణంలో ఉన్నాయని, త్వరలోనే వీటి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. మరో 45 రోజుల్లో వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బేస్‌మెంట్‌ లెవల్‌ దాటి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 8.64లక్షలుపైనే ఉన్నాయని, వీటి పనులనూ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని అధికారులు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని