CM KCR: బ్రాహ్మణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్య సమాజంపై ఉంది: కేసీఆర్‌

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి ‘బ్రాహ్మణ సదన్‌’ దేశానికే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు.

Published : 27 May 2023 23:09 IST

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దేశంలోనే మొట్టమొదటి ‘బ్రాహ్మణ సదన్‌’ దేశానికే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక సమాచార కేంద్రంగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. సమాజానికి ధార్మిక దిశానిర్దేశం చేసే కేంద్రంగా రూపుదిద్దుకోవాలన్నారు.హైదరాబాద్‌ గోపనపల్లిలో తొమ్మిదెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ‘తెలంగాణ బ్రాహ్మణ సదన్‌’ సీఎం చేతుల మీదుగా ఈనెల 31న ప్రారంభం కానుంది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ అధ్యక్షుడు, సభ్యులతో ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌.. చండీయాగం, సుదర్శన యాగం నిర్వహణ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బ్రాహ్మణ సంఘాల నాయకులు, పీఠాధిపతులు, అర్చకులు, వేదపండితులకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.

అర్చక పురోహితమే జీవనాధారంగా చేసుకుని, నిత్యం భగవత్ సేవలో నిమగ్నమవుతూ, సమస్త లోక క్షేమాన్ని కాంక్షిస్తూ తమ జీవితాలను ధారపోసే బ్రాహ్మణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సభ్య సమాజంపై ఉందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఇదే తాత్వికతతో స్వరాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యంగా ఎంచుకుని పలు పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం ఆధ్యాత్మిక తెలంగాణగా మారిందని.. దేవాలయాల పునరుజ్జీవంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు విస్తరించాయన్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి  తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి కోసం అర్చకులు, పురోహితులు, వేద పండితులు వలస వస్తున్నారని సీఎం తెలిపారు. అన్ని వర్గాలతో పాటు బ్రాహ్మణులకు కూడా నేడు తెలంగాణ ఉపాధి కేంద్రంగా మారిందని.. బ్రాహ్మణ సమాజానికి భరోసా దొరికిందన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గత ఆరేళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలును పరిషత్ అధ్యక్షులు కేవీ రమణాచారి వివరించారు. సంక్షేమ పరిషత్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు 6,500 కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని