Diabetes: కొవిడ్‌ సోకిన యుక్త వయసు పిల్లలకు.. టైప్‌-1 మధుమేహం ముప్పు..!

కొవిడ్‌-19 సోకిన చిన్నారులు, యుక్తవయసు పిల్లలకు టైప్‌-1 మధుమేహం బారినపడే ముప్పు అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.

Published : 27 Sep 2022 01:36 IST

అమెరికా నిపుణుల పరిశోధనలో వెల్లడి

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ (Coronavirus) నుంచి కోలుకుంటున్నప్పటికీ దీర్ఘకాలంలో చాలామంది ఆరోగ్యంపై అది ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్లు నివేదికలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొవిడ్‌-19 సోకిన చిన్నారులు, యుక్తవయసు పిల్లలకు టైప్‌-1 మధుమేహం బారినపడే ముప్పు అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. దాదాపు 10లక్షలకుపైగా పిల్లలు, యువతపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ఇందుకు సంబంధించిన అధ్యయన నివేదిక జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (JAMA)లో ప్రచురితమైంది.

పిల్లలు, యుక్తవయసు వారిలో కొవిడ్‌ అనంతర ప్రభావాలను అంచనా వేసేందుకు మార్చి, 2020 నుంచి డిసెంబర్‌ 2021 మధ్య కాలంలో అమెరికాతోపాటు 13 దేశాలకు చెందిన సుమారు 11లక్షల మంది ఆరోగ్య రికార్డులను అమెరికా పరిశోధకులు విశ్లేషించారు. కొవిడ్‌ సోకిన, సోకని వారిని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో ఆరు నెలల వ్యవధిలో టైప్‌-1 మధుమేహం నిర్ధారణ అయిన వారిలో ఎక్కువమంది కొవిడ్‌ సోకిన వారేనని పరిశోధకులు గుర్తించారు. చంటిబిడ్డల నుంచి 9 ఏళ్ల పిల్లలతోపాటు 10 నుంచి 18ఏళ్ల వయసు వారిలోనూ ఇదేవిధమైన ఫలితాలు వచ్చాయి. మొత్తంగా కొవిడ్‌ బారినపడిన యువతలో 6 నెలల్లో 72శాతం టైప్‌-1 మధుమేహం కేసులు పెరిగినట్లు కనుగొన్నారు.

‘టైప్‌-1 మధుమేహం అనేది శరీర స్వీయరక్షణ వ్యవస్థకు (Autoimmune) చెందిన వ్యాధి. ఇన్సులిన్‌పై రోగనిరోధక కణాలు అధికంగా దాడి చేసినప్పుడు ఇన్సులిన్‌ ఉత్పత్తి నిలిచిపోయి మధుమేహానికి దారితీస్తుంది. కొవిడ్‌ కూడా రోగనిరోధక ప్రతిస్పందనలను పెంచడమే కావడం మా పరిశోధనల్లో తేలింది’ అని అమెరికాలోని కేస్‌ వెస్టర్న్‌ రిజర్వ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసెన్‌కు చెందిన ప్రొఫెసర్‌ పమేలా డేవిస్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి చిన్నారుల్లో అధికంగా ఉన్న నేపథ్యంలో వారి ఆరోగ్యంపై తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. అయితే, కొవిడ్‌కు టైప్‌-1 మధుమేహం కేసుల పెరుగుదలకు సంబంధాన్ని చెప్పినప్పటికీ.. మధుమేహానికి కచ్చితంగా కొవిడ్‌-19 కారణమా అనే విషయంపై మాత్రం తాజా అధ్యయనం స్పష్టత ఇవ్వలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని