Food: ఆహారాన్ని లెక్కలేస్తూ తింటున్నారా!

ప్రస్తుతం చాలామంది సన్నగా అవ్వాలనే ఆలోచనతో ఆహారాన్ని లెక్కలు వేస్తూ తింటున్నారు. దీనివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందటం లేదు. తద్వారా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అసలు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి. 

Published : 20 Oct 2022 01:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కడుపు నిండేలా కాదు మనసు నిండేలా తింటున్నారా! అదెలా అంటారా! చాలామంది సన్నగా అవ్వాలని, నాజూగ్గా ఉండాలనే ఆలోచనతో తక్కువ మొత్తంలో ఆహారాన్ని తింటుంటారు. మరికొందరు గ్రాముల చొప్పున లెక్కలేసి తీసుకుంటారు. అయితే.. అసలు ఈ పద్ధతి మంచిది కాదంటున్నారు నిపుణులు.

* అందరి శరీరాకృతి ఒకేలా ఉండదు. అందరికీ ఒకే తీరు ఆహారం సరిపోదు. ఒక్కొక్కరికీ ఒక్కో మోతాదులో ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. మన పూర్వీకులు కడుపు నిండా తిని కష్టపడి పని చేసేవారు. ప్రస్తుతం తిండి, పని రెండూ యాంత్రికం అయిపోయాయి. 

* ఎక్కువ తింటే లావైపోతామనే భావనతో చాలామంది గ్రాముల్లో ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఇలా యాంత్రికమైన విధానం వల్ల ఏ ఆహారం తిన్నా తృప్తినివ్వదు. 

* బాగా ఉడికించిన ఆహారం తినటం వల్ల చక్కగా జీర్ణమవుతుంది. అందువల్ల ఉడికించిన ఆహారాన్ని తినాలి. స్నాక్స్ సమయంలో చిప్స్‌ వంటివి కాకుండా నానబెట్టిన పప్పు ధాన్యాలు, మొలకెత్తిన ధాన్యాలు తింటే జీర్ణ క్రియ చక్కగా పనిచేస్తుంది.

* జంక్‌ ఫుడ్‌కి దూరం.. ప్రస్తుతం చాలామంది ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ బయట ఫుడ్‌ తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల కడుపు నిండుతుంది తప్ప శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు. ఆహారం నిల్వ ఉండేందుకు రసాయనాలు కలుపుతారు కాబట్టి జంక్‌ ఫుడ్‌ తినడం వల్ల అనవసర కొవ్వు శరీరంలో చేరుతుంది.

* భోజనం చేసేటప్పుడు టీవీ చూస్తూ, ఫోన్‌ చూస్తూ ఉంటారు. కానీ  ధ్యాస మొత్తం తినేటప్పుడు ఆహారం మీదే ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటే ఎంతో మంచిది.

* ప్రస్తుతం మార్కెట్లో రకరకాల హెల్త్‌ డ్రింక్‌లు దొరుకుతున్నాయి. వీటిని తాగేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డ్రింక్‌లు కూడా శరీరంలో అనవసర కొవ్వు పెరిగేలా చేస్తాయి. అందువల్ల వీటికి బదులు ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తాగటం మంచిది. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. 

* తినే ఆహారానికి పక్కా కొలతలు అవసరం లేదు కానీ.. పౌష్టికాహారం తింటున్నారా లేదా గమనించుకోవాలి.  

* సమయానికి తింటే ఎంతో మేలు.. చాలామంది పని ఒత్తిడిలో సమయానికి ఆహారం తీసుకోరు. దీంతో ఊబకాయం సమస్య ఎక్కువవుతుంది. 

 * కొంతమంది ఆకలి వేసినా కూడా లావైతామనే భయంతో తినకుండా ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్య వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. 

* ఆహారాన్ని ఇష్టపడి తినండి. దీంతో శారీరకంగా, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. అనవసరమైన ఆలోచనలతో అనారోగ్యం కొని తెచ్చుకోకండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని