టాప్‌ 10 న్యూస్‌ - 1 PM

అమరావతికి ఘన చరిత్ర ఉందని.. దాని చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సాయం చేశారని.. పరిపాలనకు అవసరమైన అన్ని భవనాలు ఇప్పటికే

Published : 14 Jan 2020 13:00 IST

1. అమరావతి తరలింపు సునామీ వంటిది : చంద్రబాబు

అమరావతికి ఘన చరిత్ర ఉందని.. దాని చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సాయం చేశారని.. పరిపాలనకు అవసరమైన అన్ని భవనాలు ఇప్పటికే నిర్మించుకున్నామని తెలిపారు. ఒక్కపైసా అవసరం లేకుండా రాజధానిని కొనసాగించుకోవచ్చని పేర్కొన్నారు. విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని ప్రైవేట్‌ స్థలంలో నేతలు భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరై మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. కానిస్టేబుళ్ల ఎంపిక: 300మందికి నేరచరిత్ర

పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో కొంత మందిపై కేసులు ఉన్నట్లు తెలంగాణ పోలీస్ నియామక మండలి గుర్తించింది. మొత్తం 300 మందికి నేర చరిత్ర ఉన్నట్టు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించారు. వీరిలో దాదాపు 100 మంది అభ్యర్థులు తమపై ఉన్న  కేసుల విషయాన్ని దాచి పెట్టారు. ఎంపికైన అభ్యర్థుల్లో పలువురిపై పోక్సో, హత్య కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వారంలో పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభం కానున్న తరుణంలో కేసులున్న  వాళ్లకు సంబంధించి ఉన్నతాధికారులు ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. కాకినాడకు పవన్‌.. పోలీసుల మోహరింపు! 

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పర్యటించనున్నారు. దిల్లీ నుంచి విశాఖ చేరుకోనున్న ఆయన.. నేరుగా మధ్యాహ్నం 3గంటల సమయంలో రహదారి మార్గంలో కాకినాడకు వెళ్తారు. ఆదివారం వైకాపా కార్యకర్తలతో దాడిలో గాయపడిన జనసేన నాయకులు, కార్యకర్తలను ఆయన పరామర్శించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. బి-ఫారం ఇవ్వలేదని అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

తెరాస బి-ఫారం ఇవ్వలేదని ఓ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మేడ్చల్‌లో చోటుచేసుకుంది. మేడ్చల్‌లో 14వ వార్డుకు విజయ్‌ అనే వ్యక్తి నామినేషన్‌ వేశాడు. అయితే తనకు తెరాస బి-ఫారం ఇస్తుందని నమ్మకం పెట్టుకున్నాడు. అయితే చివరికి వేరే అభ్యర్థికి బి-ఫారం ఇవ్వడంతో మనస్తాపానికి గురయ్యాడు. పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు ఈ ఉదయం చేరుకొని కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అతడి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

5. ‘పౌరచట్టం’పై సుప్రీంకు కేరళ ప్రభుత్వం

దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన పౌరసత్వ చట్టాన్ని సవాల్‌ చేస్తూ కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ పినరయి విజయన్‌ ప్రభుత్వం మంగళవారం పిటిషన్‌ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 21, 25 నిబంధనలను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని, అంతేగాక లౌకికవాదం ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని ఆరోపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. నిర్భయ దోషులకు ఉరి తప్పదు

నిర్భయ కేసులో మరణ శిక్ష అమలును సవాల్‌ చేస్తూ ఇద్దరు దోషులు వేసిన క్యురేటివ్‌ పిటిషన్‌పై నేడు సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. ఈ సందర్భంగా నిర్భయ తల్లి మీడియాతో మాట్లాడారు. ‘ఉరితీత ప్రక్రియను ఆపేందుకు దోషులు సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే వారి అభ్యర్థనను న్యాయస్థానం తప్పకుండా కొట్టివేస్తుందనే నమ్మకం నాకుంది. ఈ నెల 22న దోషులను కచ్చితంగా ఉరితీస్తారు. నిర్భయకు న్యాయం జరుగుతుంది’ అని బాధితురాలి తల్లి విశ్వాసం ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి  

7. దిల్లీలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధానిలో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లారెన్స్‌ రోడ్డులోని ఓ చెప్పుల తయారీ యూనిట్‌లో మంగళవారం ఉదయం మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. 26 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ‘భాజపా తెచ్చిన మంచి రోజులు ఇవేనా?’

ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం ఇదే స్థాయిలో పెరుగుతూ.. ప్రజల ఆదాయాలు పడిపోతే యువత, విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. దీంతో పాటు సీఏఏ, ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. పొంచి ఉన్న ప్రమాదాన్ని సూచిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భాజపా హామీ ఇచ్చిన ‘మంచి రోజులు’(అచ్ఛే దిన్‌) ఇవేనా అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ట్రంప్‌ భారత పర్యటన ఫిబ్రవరిలోనేనా?

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత పర్యటనపై ఇరువైపుల నుంచి కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు పర్యటన తేదీలను ఖరారు చేసే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలో ట్రంప్‌ భారత్‌లో పర్యటించే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపినట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందూస్థాన్‌ టైమ్స్‌ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. క్రికెటర్‌గా కంటే అధ్యక్షుడిగానే ఈజీ: దాదా

బీసీసీఐ అధ్యక్షుడిగా కంటే క్రికెటర్‌గా బాధ్యతలు నిర్వర్తించడమే కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నాడు. స్పోర్ట్స్‌స్టార్‌ ఏసెస్‌ అవార్డుల కార్యక్రమానికి దాదా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘టీమిండియాకు ఉత్తమ టెస్టు జట్టు అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కొత్త ఏడాదికి కూడా ఆల్‌ ది బెస్ట్. 2020లో మెగాటోర్నీలు ఉన్నాయి. అండర్‌ 19 ప్రపంచకప్‌, పరుషుల, మహిళల టీ20 ప్రపంచకప్‌ల్లో రాణిస్తారని ఆశిస్తున్నా’’ అని తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని