ఇద్దరికీ శిరస్త్రాణం తప్పనిసరి..!

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ద్విచక్ర వాహనంపై ‘ఇద్దరికీ శిరస్త్రాణం (హెల్మెట్‌) తప్పనిసరి’ నిబంధన అమలుపై సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏ ఒక్కరికీ లేకపోయినా వాహన యజమానికి రూ.100

Updated : 27 Jan 2020 09:29 IST

రాచకొండలో కఠిన నిబంధన
అవగాహన తర్వాతే సైబరాబాద్‌లో అమలు
ఈనాడు, హైదరాబాద్‌

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ద్విచక్ర వాహనంపై ‘ఇద్దరికీ శిరస్త్రాణం (హెల్మెట్‌) తప్పనిసరి’ నిబంధన అమలుపై సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఏ ఒక్కరికీ లేకపోయినా వాహన యజమానికి రూ.100 జరిమానా విధించనున్నారు. వాహనదారులకు ముందుగా అవగాహన కల్పించి ఆ తర్వాత కొరఢా ఝుళిపించేలా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కార్యాచరణను రూపొందించారు. కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తాజా ఆదేశాలతో మరింత కఠినంగా అమలు చేసేందుకు రాచకొండ పోలీసులు సన్నద్ధమయ్యారు.

వాహనదారులు ఇబ్బంది పడకుండా..
మోటారు వాహనాల చట్టం 129 సెక్షన్‌ ప్రకారం ద్విచక్ర వాహనంపై ఇద్దరికీ శిరస్త్రాణం ఉండాల్సిందే. లేదంటే జరిమానా విధించేందుకు అవకాశముంది. అయితే.. ఈ నిబంధన అమలుపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు పెద్దగా దృష్టి సారించలేదు. గతేడాది ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న వంద మంది వ్యక్తులు మరణించడంతో అప్రమత్తమయ్యారు. ఇద్దరికీ శిరస్త్రాణం తప్పనిసరి నిబంధన అమలుపై అధ్యయనం చేశారు. వాహనదారులకు ఈ నిబంధనపై అవగాహన లేకపోవడంతో ఒకేసారి జరిమానా విధించడం ప్రారంభిస్తే ఇబ్బంది పడే అవకాశముందని గుర్తించారు. ముందుగా అవగాహన కల్పించి ఆ తర్వాత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నిబంధనపై సామాజిక మాధ్యమాలు, క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

15 రోజుల్లోనే 328 మందికి..
ఈ నిబంధనను రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ఈ నెల 7వ తేదీ నుంచి అమలు చేస్తున్నారు. 15 రోజుల వ్యవధిలోనే 328 మందికి జరిమానా విధించారు. మున్సిపల్‌ ఎన్నికలు, వాహనదారులకు అవగాహన లేకపోవడం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని చూసీ చూడనట్లుగా వదిలేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తాజాగా ఆదేశించారు. పోలీసులకు కూడా మినహాయింపు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. దీంతో అప్రమత్తమైన రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు కీలక ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.

వెనుక కూర్చున్న 128 మంది దుర్మరణం
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా తగ్గుముఖం పట్టడం లేదు. ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదాల బాధితుల్లో ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే ఉంటుండటం గమనార్హం. ఇలాంటి తరుణంలో అప్రమత్తమైన సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. శిరస్త్రాణం వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రెండు కమిషనరేట్ల పరిధిలో తేడాది ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న 128 మంది మరణించినట్లుగా గుర్తించి అప్రమత్తమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని