వివేకా కేసు సీబీఐకి ఇచ్చేందుకు అభ్యంతరమేంటి?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌...

Published : 29 Jan 2020 00:33 IST

ప్రశ్నించిన హైకోర్టు..విచారణ ఫిబ్రవరి 6కి వాయిదా

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌, తెదేపా నేతల బీటెక్‌ రవి, భాజపా నేత ఆదినారాయణరెడ్డి వేర్వేరుగా ఇప్పటికే పిటిషన్లు వేశారు. తాజాగా వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా సీబీఐకి అప్పగించాలంటూ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. సిట్‌ బృందంలో 3 టీంలున్నా దర్యాప్తు సరిగా జరగడంలేదని సునీత పేర్కొన్నారు. మళ్లీ అదే పోలీసులతో దర్యాప్తు చేయించడం సరికాదన్నారు. 15 మంది అనుమానితుల పేర్లను సునీత తన పిటిషన్‌లో ప్రస్తావించారు. వారిలో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బీటెక్‌ రవి, వాచ్‌మెన్‌ రంగయ్య, ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సీఐ శంకరయ్య, ఏఎస్‌ఐ రామకృష్ణ, సురేంద్రనాథ్‌ రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి ఉన్నారు. ఈ వ్యాజ్యాన్నీ మిగతా వాటితో కలిపి విచారిస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ వ్యాజ్యాలపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ప్రస్తుత సీఎం జగన్‌ ఒకరని.. ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని న్యాయస్థానం ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇచ్చేందుకు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) అందుబాటులో లేకపోవడంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ విచారణ తుది దశలో ఉందని.. ఈ సమయంలో దర్యాప్తును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫున ఏజీ గతంలో హైకోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. 

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని