మేడారంలో శాశ్వత ఏర్పాట్లు: ఎర్రబెల్లి

తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సమ్మక్క-సారక్క జాతరను ఘనంగా నిర్వహించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మేడారం జాతర జరుగుతున్న తీరును మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతి రాఠోడ్‌ వివరించారు.

Updated : 08 Feb 2020 18:37 IST

ములుగు: తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సమ్మక్క-సారక్క జాతరను ఘనంగా నిర్వహించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మేడారం జాతరపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతి రాఠోడ్‌ మీడియాతో మాట్లాడారు. జాతరను విజయవంతంగా నిర్వహించడంలో మీడియా కీలకంగా వ్యవహరించిందని ఎర్రబెల్లి చెప్పారు. మేడారం జాతర నిర్వహణపై సీఎం కేసీఆర్‌ నిరంతరం సమీక్షలు జరిపారని తెలిపారు. జాతర నిర్వహణ చూసి భాజపా నేతలు సైతం మెచ్చుకున్నారని మంత్రి పేర్కొన్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ ఉత్సవంగా కేంద్రం గుర్తించాలని ఎర్రబెల్లి కోరారు. జాతరకు జాతీయ పండగ గుర్తింపు సాధించేందుకు ప్రజలందరి సహకారం కావాలన్నారు. సమ్మక్క-సారలమ్మ దీవెనలే ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాయని అన్నారు. మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి వివరించారు. త్వరలోనే శాశ్వత ప్రాతిపదికన వసతులు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం 100 ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. పర్యాటక ప్రాంతంగా మేడారాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు. 

గతంతో పోలిస్తే అధికంగా వచ్చారు: సత్యవతి రాఠోడ్‌

మేడారంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జాతర జరుగుతోందని.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే సుమారు 70 ప్రాంతాల్లో జాతర కొనసాగుతోందని మంత్రి సత్యవతి రాఠోడ్‌ తెలిపారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు గతంతో పోలిస్తే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని చెప్పారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించామని మంత్రి వివరించారు. గత జాతరతో పోల్చితే ఈ జాతరకు ఇప్పటి వరకు 20 నుంచి 25 శాతం భక్తులు అధికంగా వచ్చారని అంచనా వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని