మాంసం అధిక ధరలకు విక్రయిస్తే ఉపేక్షించం

రాష్ట్రంలో మాంసం ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో చికెన్, మటన్‌, చేపల లభ్యతపై మాసబ్ ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.

Updated : 30 Mar 2020 16:47 IST

మంత్రి తలసాని

హైదరాబాద్‌: రాష్ట్రంలో మాంసం ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో చికెన్, మటన్‌, చేపల లభ్యతపై మాసబ్ ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పశుసంవర్థక, మత్స్య, పోలీసు, రవాణా శాఖ అధికారులతో జిల్లా స్థాయిలో కో-ఆర్డినేషన్ కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారిని నియమిస్తామని అన్నారు. లాక్‌డౌన్‌తో జిల్లాల నుంచి గొర్రెలు, మేకల సరఫరా నిలిచిన కారణంగానే మటన్ ధరలు పెరిగాయని తలసాని వివరించారు.

మాంసం విక్రయించే దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని స్పష్టం చేశారు. కూరగాయలు, పాలు, పండ్లు, కోళ్లు, గుడ్లు తదితర నిత్యావసర వస్తువుల సరఫరాకు ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. గొర్రెలు, మేకల పెంపకం దారులు వాటిని విక్రయించుకునేందుకు వీలుగా అనుమతుల కోసం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. మత్స్యకారులు చేపలను రవాణా చేసి, విక్రయించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అదేవిధంగా రవాణా చేసే వస్తువులను తెలిపేలా వాహనాలకు తప్పని సరిగా పోస్టర్లను అంటించాలని స్పష్టం చేశారు. చికెన్ దుకాణాల్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేలా జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండి ప్రకాశ్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ, పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని