వనస్థలిపురంలో కరోనాతో వృద్ధుడి మృతి

హైదరాబాద్‌ వనస్థలిపురంలో కరోనా సోకి వృద్ధుడు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అతడి కుటుంబంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే వనస్థలిపురంలోని..

Updated : 30 Apr 2020 18:38 IST

రెండో కుమారుడికీ పాజిటివ్‌ నిర్ధారణ

వనస్థలిపురం (హైదరాబాద్‌): నగరంలోని వనస్థలిపురంలో కరోనా వైరస్‌ సోకి వృద్ధుడు మృతిచెందినట్లు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో భీంనాయక్‌ తెలిపారు. అతడి రెండో కుమారుడికీ కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే వనస్థలిపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన వ్యక్తికి కరోనా సోకినట్లు ఇటీవల నిర్ధారణ కావడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా సోకిన సదరు వ్యక్తి వనస్థలిపురం ఫేజ్‌-2లో నివాసముంటున్న తన తల్లిదండ్రులు, సోదరుడు ఉంటున్న ఇంటికి వచ్చాడు. దీంతో సోదరుడితో పాటు ఎస్‌కేడీ నగర్‌లో ఉంటున్న సమీప బంధువులను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మిగతా కుటుంబసభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఈ క్రమంలో కరోనా సోకిన వ్యక్తి తండ్రి (74) బాత్‌రూంలో జారిపడటంతో ఆ వృద్ధుడిని చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించారు. అయితే నిమ్స్‌ వైద్యులు కరోనా అనుమానంతో వృద్ధుడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ బుధవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతిచెందాడు. కరోనా సోకడంతోనే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

ఆ వృద్ధుడి రెండో కుమారుడికీ కరోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో వనస్థలిపురంలో నివాసముంటున్న అతడి భార్యతో పాటు సమీప బంధువులు ఐదుగురిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జీహెచ్‌ఎంసీ, వైద్యఆరోగ్యశాఖ, పోలీసు అధికారులు కరోనా సోకిన వ్యక్తి నివాసముంటున్న ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేసి కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించి రాకపోకలను నిషేధించారు. చనిపోయిన వృద్ధుడితో పాటు కరోనా సోకిన అతడి రెండో కుమారుడు వనస్థలిపురంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. వీరితో ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన 40 మందిని అధికారులు గుర్తించి వారిని హోంక్వారంటైన్‌లో ఉంచారు. ఆ ప్రాంతంలో వైద్య సిబ్బందితో సర్వేనిర్వహిస్తున్నామని.. కరోనా లక్షణాలు ఉంటే వెంటనే సమాచారం అందించాలని అధికారులు సూచించారు. 

కేంద్ర బృందం పర్యటన

వనస్థలిపురం పరిధిలోని చింతలకుంట ప్రాంతంలో కేంద్ర బృందం పర్యటించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను కేంద్రబృందం అధికారులు అడిగి తెలుసుకున్నారు. వనస్థలిపురం ఫేజ్‌-2లో పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన పటిష్ఠ చర్యలపై స్థానిక అధికారులు, పోలీసులకు కేంద్రబృందం పలు సూచనలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని