ఆ వీరపత్ని కన్నీటికి అర్థమేంటి?

సైన్యంలో చేరాలి. మాతృభూమికి సేవ చేయాలి. తల్లి భారతికి వందనం సమర్పించాలి. ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఇదే ధ్యాస. ఇదే కల. తండ్రి సైన్యంలో బ్రిగేడియర్‌ (విశ్రాంత). సోదరీ సైనికురాలే. ఎన్నో రోజులు కలలుగని ఆయనా స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. 2008లో భారత సైన్యంలో చేరారు....

Updated : 06 May 2020 18:21 IST

మేజర్‌ అనూజ్‌ సూద్‌ శవపేటికపై మోచేతులు ఆన్చి..

సైన్యంలో చేరాలి. మాతృభూమికి సేవ చేయాలి. తల్లి భారతికి వందనం సమర్పించాలి. ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఇదే ధ్యాస. ఇదే కల. తండ్రి సైన్యంలో బ్రిగేడియర్‌ (విశ్రాంత). సోదరీ సైనికురాలే. ఎన్నో రోజులు కలలుగని ఆయనా స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. 2008లో భారత సైన్యంలో చేరారు.

రెండున్నరేళ్లుగా జమ్ము కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆరు నెలల విశ్రాంతి కోసం మరికొద్ది రోజుల్లో ఇంటికి రానున్నారు. ఇదే సమయంలో హంద్వారాలో ఓ భారీ సైనిక ఆపరేషన్‌ మొదలైంది. ఎన్నాళ్లుగానో తప్పించుకుంటున్న మోస్ట్‌వాంటెడ్‌ టెర్రరిస్టు, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ టాప్‌కమాండర్‌ రియాజ్‌ నైకూ, అతడి అనుచరులు మళ్లీ స్థానికులను అడ్డంపెట్టుకొని తప్పించుకోచూశారు. కానీ ఈ సారి సైన్యం దృఢనిశ్చయంతో ఉంది. వారినెలాగైనా బంధించి లేదా హతమార్చే తిరిగి వెళ్లాలనుకుంది. దాదాపు 16 గంటల ఆపరేషన్‌. (బుధవారమూ కొనసాగింది)

ప్రజల ప్రాణాలకు ముప్పురావొద్దని ఆచితూచి వ్యవహరిస్తున్న సైనికులు, పోలీసులపై ఆ ముష్కరులు అదే ప్రజలను అడ్డుపెట్టుకొని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కల్నల్‌ అశుతోష్‌ శర్మ, మేజర్‌ అనూజ్‌ సూద్‌ సహా మరో ముగ్గురు వీరమరణం పొందారు.

ఆరు నెలల విశ్రాంతి కోసం ఇంటికి రావాలనుకున్న సైనికుడే మేజర్‌ అనూజ్‌ సూద్‌. పంచకుల వీరి స్వస్థలం. తిరిగొచ్చి గురుదాస్‌పూర్‌ 12గార్డ్స్‌ విభాగంలో చేరనున్నాడు. అయితే ఆయన పార్థివదేహం శవపేటిక ఇంటికి చేరడంతో ఆ కుటుంబసభ్యుల ఆవేదనకు అంతులేకుండాపోయింది.

జీవితంలో ఎన్నో కలలు, ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబం బాధను ఎవరు తీర్చగలరు? ఆ వీర మరణం పొందిన ఆ జవాను సతీమణి ఆకృతి సూద్‌ గుండెల్లో పెల్లుబికుతున్న కన్నీటిని ఎవరు ఆపగలరు? భర్త, పిల్లలతో కలిసి అల్లుకున్న కలల పందిరి పాదు ఎండిపోయిందని తెలిసి విలవిల్లాడుతున్న ఆమె వైరాగ్యాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?

మేజర్‌ అనూజ్‌ సూద్‌ పార్థివ దేహం పంచకులకు చేరుకున్నాక ఆ శవపేటికపై మోచేతులు పెట్టి తన భర్త ముఖంలోకి చూస్తూ బాధనంతా గుండెల్లోనే దిగమింగి కన్నీటి చుక్కల్నీ రాల్చలేకపోతున్న ఆమె చిత్రం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆమె భావోద్వేగాలను చూశాక ఎవ్వరైనా నిశ్శబ్దంగా మారాల్సిందే. ఎందుకంటే ఆమె హృదయంలో పొంగిపొరలుతున్న దుఃఖాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వర్ణించడం అంతకన్నా సంక్లిష్టం.

చండీగఢ్‌లోని పంచకులలో మేజర్‌ అనూజ్‌సూద్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సైనికులు మూడుసార్లు గాల్లోకి కాల్చి గౌరవ వందనం చేశారు. తండ్రి, బ్రిగేడియర్‌ చంద్రకాంత్‌ తన కొడుకు చితికి నిప్పటించారు. తన కుమారుడు జాతి గర్వించే బిడ్డ అని విలపించారు. మేజర్‌ అనూజ్‌ సూద్‌ వయసు కేవలం 30 సంవత్సరాలు.

-ఇంటర్నెట్‌డెస్క్‌

ఇవీ చదవండి

హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ హతం?

కల్నల్‌, మేజర్‌ సహా ఐదుగురి వీరమరణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని