భూ వివాదంలో జడ్చర్ల కాంగ్రెస్‌ నేత హత్య

జడ్చర్ల కాంగ్రెస్‌ నేత రాంచంద్రారెడ్డి(72) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన వాహనంలోనే కిడ్నాప్‌ చేసి ఈ దారుణానికి ఒడిగట్టారు.

Updated : 20 Jun 2020 08:36 IST

షాద్‌నగర్‌లో కిడ్నాప్‌.. పెంజర్లలో మృతదేహం
రక్తసంబంధీÅకులపై  పోలీసుల అనుమానం

షాద్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే : జడ్చర్ల కాంగ్రెస్‌ నేత రాంచంద్రారెడ్డి(72) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన వాహనంలోనే కిడ్నాప్‌ చేసి ఈ దారుణానికి ఒడిగట్టారు. కొన్నేళ్లుగా కొనసాగుతోన్న భూవివాదంలో రక్త సంబంధీÅకులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం షాద్‌నగర్‌ మండలం అన్నారానికి చెందిన రాంచంద్రారెడ్డి కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్‌ పార్టీ ప్రముఖునిగా కొనసాగుతున్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలం అన్నారంలో రాంచంద్రారెడ్డికి భూములున్నాయి. ఇందులో 9 ఎకరాలపై అమెరికాలో ఉండే రక్తసంబంధీÅకులతో కోర్టులో వివాదం నడుస్తోంది. ఆ స్థలం విలువ సుమారు రూ.6 కోట్ల వరకు ఉంటుంది. ఆ బంధువులకు సంబంధించిన స్థానిక భూవ్యవహారాలను ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తి పర్యవేక్షిస్తున్నాడు. శుక్రవారం రాంచంద్రారెడ్డి ఆ 9 ఎకరాల భూమి వద్దకు వెళ్లి తిరిగి షాద్‌నగర్‌కు తన వాహనంలో డ్రైవర్‌ పాషాతో కలిసి వస్తున్నాడు. ఆ సమయంలో ప్రతాప్‌రెడ్డితో పాటు వెల్జర్లకు చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి స్థానిక దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలో వీరిని అడ్డుకున్నారు. డ్రైవర్‌ను కత్తితో చంపేస్తామని బెదిరించారు. అతను వాహనం నుంచి పారిపోయి ఠాణాకు చేరుకొని విషయాన్ని పోలీసులకు వివరించాడు. సదరు వ్యక్తులు రాంచంద్రారెడ్డిని అదే వాహనంలో తీసుకెళ్లిపోయారు. డ్రైవర్‌ సమాచారంతో ఏసీపీ సురేందర్‌, ఎస్సై విజయభాస్కర్‌ అప్రమత్తమయ్యారు. పాఠశాల పరిసర ప్రాంతాల సీసీ ఫుటేజీలను పరిశీలించారు. రాంచంద్రారెడ్డి ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా వాహనం కొత్తూరు మండలం పెంజర్లలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా.. వాహనంలోనే రాంచంద్రారెడ్డి మృతి చెంది ఉన్నారు. మెడ, పొట్ట భాగంలో కత్తితో పొడిచి హతమార్చినట్లు ఏసీపీ వెల్లడించారు. ఘటనాస్థలాన్ని శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి పరిశీలించారు.  

ఓ స్థానిక నేత ప్రమేయముందా..: ఈ భూ వివాదంపై ఇరు వర్గాల వారిని షాద్‌నగర్‌ పోలీసులు బైండోవర్‌ చేసినట్లు సమాచారం. సదరు భూమి కొన్నేళ్లుగా రాంచంద్రారెడ్డి ఆధీనంలో ఉండగా.. ఇటీవల ప్రతాప్‌రెడ్డి ప్రమేయంతో ఓ స్థానిక నేత సంబంధీÅకులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. స్థలాన్ని తమకు స్వాధీనపర్చాలని సదరు నేత, ప్రతాప్‌రెడ్డి తదితరులు రాంచంద్రారెడ్డిపై ఒత్తిడి తెచ్చారని.. అతను ఒప్పుకోకపోవడంతో హతమార్చారని ప్రచారం జరుగుతోంది.
సాయంత్రం 4.30 గంటలు: షాద్‌నగర్‌లో కిడ్నాప్‌
5.00 గంటలు : పోలీసుల అప్రమత్తం.. గాలింపు
7.30 గంటలు : కొత్తూరు మండలం పెంజర్లలో మృతదేహం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని