హోం ఐసోలేషన్‌: కొత్త మార్గదర్శకాలివే! 

కొవిడ్‌-19 హోం ఐసోలేషన్‌ నియమ, నిబంధనలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సవరించింది. ఎలాంటి లక్షణాలు లేని, తక్కువ లక్షణాలు

Updated : 04 Jul 2020 07:57 IST

న్యూదిల్లీ: కొవిడ్‌-19 హోం ఐసోలేషన్‌ నియమ, నిబంధనలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సవరించింది. ఎలాంటి లక్షణాలు లేని, తక్కువ లక్షణాలు ఉన్న కరోనా రోగులను హోం ఐసోలేషన్‌ జాబితాలో చేర్చింది. సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. హెచ్‌ఐవీ, క్యాన్సర్‌ థెరపీ, ట్రాన్స్‌ప్లాంట్‌ రోగులకు.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, వారు హోం ఐసోలేషన్‌కు అర్హులు కాదు. వీరితో పాటు 60ఏళ్లు దాటిన వృద్ధులు బీపీ, మధుమేహం, గుండె జబ్బులు, శ్వాస, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు వైరస్‌ సోకినప్పుడు హోం ఐసోలేషన్‌లో ఉండాలంటే వైద్యుని అనుమతి తప్పనిసరి.

కొవిడ్‌-19 నిర్ధారణ అయినా ఎక్కువశాతం రోగుల్లో లక్షణాలు లేకపోవడంతో కేంద్ర ఆరోగ్యశాఖ హోం ఐసోలేషన్‌కు సంబంధించి నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. లక్షణాలు లేని కరోనా రోగులు, తక్కువ లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండవచ్చని పేర్కొంది. అయితే, హెచ్‌ఐవీ రోగులు, అవయవాల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నవారు, క్యాన్సర్‌ థెరపీ చేసుకున్నవారు కరోనా సోకితే ఇంట్లోనే  ఐసోలేషన్‌లో ఉండేందుకు వీలులేదని, ఆస్పత్రిలో చేరాలని తేల్చి చెప్పింది. 60ఏళ్లకు పైబడిన వారు మధుమేహం, హృద్రోగాలు, అధిక రక్తపోటు, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల సమస్యలున్న వారికి కరోనా సోకితే వైద్యులు పర్యవేక్షణ తర్వాతే హోం ఐసోలేషన్‌ ఉంచాలో.. వద్దో నిర్ణయించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న కరోనా రోగులకు లక్షణాలు ప్రారంభమై పదిరోజులు గడిచినా, వరుసగా మూడు రోజులు జ్వరం లేకుండా ఉన్నా వారిని డిశ్చార్జీ చేసినట్లు భావించాలని, నూతన మార్గదర్శకాల్లో కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అలాంటివారు మరో ఏడు రోజుల పాటు ఇంట్లో ఉంటూ తమకి తాము ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాలని సూచించింది. కరోనా రోగులకు హోం ఐసోలేషన్‌ గడువు పూర్తయిన తర్వాత మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే, హోం ఐసోలేషన్‌లో ఉన్న సమయంలో ఇతర కుటుంబ సభ్యులతో కలవకుండా జాగ్రత్త పడాలని, అలాంటి సదుపాయాలు ఇంట్లో ఉంటేనే, హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులకు సంరక్షకులు 24గంటలూ కమ్యూనికేషన్‌లో అందుబాటులో ఉండాలని పేర్కొంది. సంరక్షకుడితో పాటు, రోగితో సన్నిహితంగా ఉండేవారు, హైడ్రీక్లోరోక్విన్‌ ఔషధాన్ని ముందు జాగ్రత్తగా వైద్యుని సూచనమేరకు తీసుకోవాలని తెలిపింది. ఆరోగ్య సేతు మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని నిరంతరం దాన్ని యాక్టివ్‌గా ఉంచాలని తెలిపింది. జిల్లా ఆరోగ్య అధికారులు, నిఘా బృందాల ద్వారా కరోనా రోగుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపింది. రోగులు కూడా స్వీయ నిర్బంధం నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్‌ స్థాయిలో తగ్గుదల, గుండె నొప్పి, మూర్చ, ఏదైనా అవయవం, ముఖంలో బలహీనత, పెదవులు.. ముఖంలో నీలిరంగు రావడాన్ని లక్షణాలు కనిపిస్తే, వెంటనే వారికి వైద్య సాయం అందించాలని తెలిపింది. నూతన మార్గదర్శకాల ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితిని క్షేత్ర స్థాయిలో ఆరోగ్య బృందాలు రోజూ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత, పల్స్‌ రేట్‌ వంటివి రికార్డు చేయాలి. వారికి తగిన సూచనలు ఇవ్వాలి. కొవిడ్‌-19 పోర్టల్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగుల వివరాలు కూడా అప్‌డేట్‌ చేయాలి. రోగుల కుటుంబ సభ్యులు, సన్నిహితులను ప్రొటోకాల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి. 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని