టీబీ టీకాతో కొవిడ్‌ నుంచి మెరుగైన రక్షణ!

క్షయ (టీబీ) వ్యాధి నివారణకు టీకా పొందినవారికి కొవిడ్‌-19 నుంచి మెరుగైన రక్షణ లభిస్తోందని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం పేర్కొంది.

Published : 14 Aug 2020 10:40 IST

జెరుసలేం: క్షయ (టీబీ) వ్యాధి నివారణకు టీకా పొందినవారికి కొవిడ్‌-19 నుంచి మెరుగైన రక్షణ లభిస్తోందని ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. యువతకు దీనివల్ల బాగా ప్రయోజనం కలిగినట్లు తెలిపింది. బెన్‌ గురియన్‌ యూనివర్సిటీ, హీబ్రూ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. క్షయ వ్యాధి నివారణకు బీసీజీ టీకాను ఇస్తుంటారు. ఈ వ్యాక్సిన్‌ను సార్వత్రికంగా ఇవ్వడాన్ని చాలా దేశాలు ఆపేశాయని, కొన్ని దేశాలు మాత్రమే దీన్ని ఇస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనాపై ఈ టీకా ఎలా ప్రభావం చూపుతోందన్నదాన్ని వారు విశ్లేషించారు. 30 లక్షల కన్నా ఎక్కువ జనాభా కలిగిన 55 దేశాలకు సంబంధించిన డేటాను పరిశీలించారు. ప్రతి 10 లక్షల మంది జనాభాలో.. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్, మరణాల స్థాయిని తగ్గించడంలో ఇది సాయపడిందని శాస్త్రవేత్తలు చెప్పారు. గడిచిన 15 ఏళ్లలో ఈ టీకాను పొందిన 24 ఏళ్ల లోపు వయసున్నవారికి ఇది బాగా ఉపయోగపడిందని తెలిపారు. ఈ టీకాను పొందిన పెద్ద వయసువారిలో మాత్రం దీని ప్రభావం లేదన్నారు. కొవిడ్‌పై ఈ వ్యాక్సిన్‌ ఎందుకు ప్రభావం చూపుతోందన్నది శాస్త్రవేత్తలకు ఇంకా అంతుచిక్కలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని