అద్దెకు బోయ్‌ఫ్రెండ్‌

వేలంటైన్స్‌ డే.. ప్రేమికులకు పేద్ద పండగ. మనసు విప్పి మాట్లాడుకోవడాలు, క్యాండిల్‌ లైట్‌ డిన్నర్లు, పార్టీలు, డేట్‌లు..

Published : 13 Feb 2021 23:22 IST

వేలంటైన్స్‌ డే.. ప్రేమికులకు పేద్ద పండగ. మనసు విప్పి మాట్లాడుకోవడాలు, క్యాండిల్‌ లైట్‌ డిన్నర్లు, పార్టీలు, డేట్‌లు.. ఈ మూణ్నాలుగు రోజులు లవర్స్‌ ఫుల్‌ బిజీ. మరి ఈడు ఉండి జోడు లేని వారి సంగతేంటి? ‘బేఫికర్‌.. ఇదేం బాధ పడే విషయమే కాద’ంటున్నాడు ముంబై కుర్రాడు శకుల్‌ గుప్తా. వలపుకాడు లేని అమ్మాయిల లోటు తీర్చేందుకు తనే డేట్‌బోయ్‌గా మారుతున్నాడు. అద్దెకు అందుబాటులో ఉంటానంటూ ‘బోయ్‌ఫ్రెండ్‌ ఆన్‌ రెంట్‌’ పేరుతో మూడేళ్ల నుంచి ఫేస్‌బుక్, ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తున్నాడు. ‘నిజానికి లవర్‌ లేకపోవడం పెద్ద విషయమేం కాదు. అలాంటివాళ్లు తమని తాము ప్రేమించుకుంటే చాలు. మంచి ఉద్యోగం, సొంత ఫ్లాట్‌ ఉన్నా నాకు ఇప్పటివరకూ గర్ల్‌ ఫ్రెండ్‌ లేదు. అలాగే బోయ్‌ఫ్రెండ్‌ లేని అమ్మాయితో నేను డేట్‌కి సిద్ధం’ అని ప్రకటించాడు. ‘నేను చాలా సరదాగా, ఓపెన్‌ మైండ్‌తో ఉంటా. నా భుజాలపై తలవాల్చి తను మనసులోని భావాలన్నీ పంచుకోవచ్చు’ అని చెబుతున్నాడు. అతడి ప్రచారానికి వందలమంది స్పందించారు. ఈ మూడేళ్లలో శకుల్‌ 45 మందితో డేట్‌కి వెళ్లాడట. ‘ఒకమ్మాయితో బైక్‌పై లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్లా. ట్రెక్కింగ్‌ చేసి కొండ అంచులు చేరుకున్నాం. అక్కడ చుక్కల్ని లెక్కిస్తూ సాయంత్రమంతా గడిపాం. ఇది నా జీవితంలో మర్చిపోలేని అనుభవం’ అంటున్నాడు. ‘ఆడ, మగ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటే బాధలన్నీ ఉఫ్‌మని ఎగిరిపోతాయి. ఒంటరి భావన తొలగిపోతోంది. దాని కోసమే నేను ఈ బాట పట్టా’ అంటున్నాడు శకుల్‌. కానీ అతడి ప్రచారాన్ని చాలామంది ట్రోల్‌ చేస్తున్నారు. అతడి అమ్మానాన్నలైతే ఇది మన సంప్రదాయం కాదు వదిలేయమన్నారట. అయినా ట్రెండ్‌ని వదిలేది లేదంటున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని