TS News: పుస్తకాలకెక్కింది.. ఆ గ్రామాల స్ఫూర్తి!

ఆడపిల్లలు పుడితే అక్కడ సంబరం చేసుకుంటారు. అంతా కలిసి మిఠాయిలు పంచుకొని 

Published : 14 Aug 2021 12:34 IST

ఆడపిల్లలను గౌరవించడంలో హరిదాస్‌పూర్, ఎద్దుమైలారం ఆదర్శం

ఈనాడు, సంగారెడ్డి: ఆడపిల్లలు పుడితే అక్కడ సంబరం చేసుకుంటారు. అంతా కలిసి మిఠాయిలు పంచుకొని సంతోషంగా గడుపుతారు. పంచాయతీని విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. కొండాపూర్‌ మండలం హరిదాస్‌పూర్‌ గ్రామంలో తొలుత ఈ సంప్రదాయం మొదలైంది. వీరిని ఆదర్శంగా తీసుకొని కంది మండలం ఎద్దుమైలారం సర్పంచ్‌ ముందుకొచ్చారు. తమ ఊర్లోనూ ఈ విధానం అనుసరించేందుకు ఉత్సాహం చూపారు. ఇలా ఆడపిల్లలకు గౌరవం కల్పిస్తూ సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు వీరు చూపుతున్న చొరవ ఇప్పుడు పాఠ్యపుస్తకంలో చోటు దక్కించుకుంది. ఇంటర్మీడియెట్‌ ఆంగ్ల పుస్తకంలో ఈ విషయాన్ని పాఠ్యాంశంగా ప్రచురించారు. ‘లింగవివక్ష ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ఇలాంటి సమయంలో కొండాపూర్‌ మండలం హరిదాస్‌పూర్‌లో ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం మొదలైంది. సర్పంచ్‌ షఫీ నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమం తక్కువ వ్యవధిలోనే మంచి ఫలితాలను సాధించింది. ఈ ప్రేరణతో ఎద్దుమైలారంలోనూ దీనిని అమలు చేస్తున్నారు. ఇక్కడ ఒకే రోజు 72 మందిని సుకన్య సమృద్ధి యోజనలో చేర్చారు..’ అంటూ   పుస్తకంలో ప్రచురించారు. ఇంటర్‌ విద్యార్థులు ఈ వ్యాసం చదివి దిగువన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. తద్వారా అమ్మాయిలను గౌరవించే ఈ గ్రామాల గురించి రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ పిల్లలంతా తెలుసుకోవడానికి అవకాశమేర్పడింది.

సంబరం.. ఎస్‌ఎస్‌వై ఖాతా 

హరిదాస్‌పూర్‌లో ఈ కార్యక్రమానికి 2020, జనవరి 1న శ్రీకారం చుట్టారు. సత్యవాణికి జన్మించిన భవ్యశ్రీ అనే అమ్మాయితో ప్రారంభించారు. ఆడపిల్లల పేరిట సంబరం చేసి, వారందరికీ సుకన్య సమృద్ధి యోజన     (ఎస్‌ఎస్‌వై) ఖాతాలు తెరిపిస్తున్నారు. వీరు చేస్తున్న మంచి పని చూసి ‘సేవ్‌ ది గర్ల్‌ ఛైల్డ్‌’ ప్రతినిధులూ      ...మిగతా స్పందించారు. కళింగ క్రిష్ణకుమార్, నవాబ్‌ శివకుమార్‌గౌడ్, డాక్టర్‌ శంకర్‌బాబు, డాక్టర్‌ చక్రపాణి, ఉదయ్‌కుమార్‌... ఇలా పలువురు ముందుకొచ్చి పాఠశాలను బాగుచేయించారు. అవసరమైన ఫర్నిచర్‌ సమకూర్చారు. ఈ ఊర్లో పదేళ్లలో పుట్టే ప్రతి ఆడపిల్లకు ఎస్‌ఎస్‌వై ఖాతాలో జమచేసేలా తొలి నాలుగు కిస్తీల డబ్బును తామే అందిస్తామని ప్రకటించారు. ఫిబ్రవరిలో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్‌ ఈ పల్లెలో ఆడపిల్లలందరికీ ‘కన్యావందనం’ సమర్పించారు. ఎద్దుమైలారం సర్పంచి మల్లారెడ్డి మార్చిలో నిర్వహించిన కార్యక్రమంలో పాలనాధికారి హనుమంతరావు పాల్గొన్నారు. ఆయన సమక్షంలో గ్రామంలోని 72 మంది బాలికలను ఎస్‌ఎస్‌వై పథకంలో చేర్పించారు.
మరింత ఉత్సాహంగా పనిచేస్తాం షఫీ: సర్పంచి, హరిదాస్‌పూర్‌

ఆడపిల్లల మీద వివక్ష పోవాలి. సమాజంలో గౌరవం దక్కాలి. అత్యాచారాలు, అకృత్యాలకు అడ్డుకట్టపడాలి. అందుకే మా వంతుగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. చాలామంది దాతలూ ముందుకొచ్చి సహకరిస్తున్నారు. ఇంటర్‌ ఆంగ్ల పుస్తకంలో మా ఊరి గురించి రాశారని తెలుసుకున్నా. మరింత ఉత్సాహంగా పనిచేస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని