మండమెలిగే.. భక్తులకు పండగే

మేడారం మహాజాతర.. పరిచయం అక్కర్లేని పండుగ. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచింది.. రెండేళ్లకోసారి వైభవంగా జరుగుతుంది. మహాజాతర తర్వాత ఏడాది నిర్వహించే మండమెలిగే పండుగే చిన్నజాతర.

Updated : 30 Nov 2022 06:27 IST

ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మేడారం చిన్నజాతర
ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: తాడ్వాయి(ములుగు జిల్లా), న్యూస్‌టుడే

మేడారం మహాజాతర.. పరిచయం అక్కర్లేని పండుగ. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచింది.. రెండేళ్లకోసారి వైభవంగా జరుగుతుంది. మహాజాతర తర్వాత ఏడాది నిర్వహించే మండమెలిగే పండుగే చిన్నజాతర. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతుంటారు. తల్లుల సన్నిధిలో నాలుగు రోజుల పాటు సందడి నెలకొంటుంది. చిన్నజాతర నిర్వహించడానికి పూజారులు, అధికారులు తేదీలు ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు చిన్నజాతర కనులపండువగా జరగనుంది.

మేడారం చిన్నజాతర కూడా ప్రఖ్యాతి గాంచింది. ఆ నాలుగు రోజుల పాటు మేడారం పరిసరాలన్నీ కిటకిటలాడుతుంటాయి. మండమెలిగేను పురస్కరించుకొని సమ్మక్క, సారలమ్మ ఆలయాల శుద్ధి చేయడంతో పాటు గ్రామ దిగ్బంధనం చేస్తారు. పూజారుల కుటుంబాలు నిష్టతో అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా, తదితర ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలివచ్చి సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.

2003 నుంచి అడుగులు

మండమెలిగే పండగే చిన్నజాతరగా రూపాంతరం చెందింది. దీనికి 2003లో అడుగులు పడ్డాయి. మొదట పూజారులే నిర్వహించారు. 2007 నుంచి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2021లో 6 లక్షల మంది వచ్చారని అధికారులు చెబుతున్నారు. ఈసారీ పెద్ద ఎత్తున వచ్చే  అవకాశం ఉంది.

ముందస్తుగా పనులు చేపట్టాలి

చిన్న జాతరకు సరిగ్గా 2 నెలల సమయం ఉంది. భక్తులు జనవరి నుంచి మేడారం వస్తుంటారు. వారికి సకల సౌకర్యాలు కల్పించడానికి ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతిసారి ఏర్పాట్లలో జాప్యం జరుగుతుంటుంది. ఈసారి ముందస్తుగా పూర్తి చేస్తే బాగుంటుంది. వివిధ శాఖలతో సమీక్షలు జరిపి ప్రతిపాదనలు చేసి పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలి.

వీటిపై దృష్టి సారించాలి

మేడారంలో చెత్తాచెదారం పోగవుతుంది. ఎప్పటికప్పుడు చెత్త తరలిస్తూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆలయ పరిసరాలు, జంపన్నవాగు, చిలకల గుట్ట, రెడ్డిగూడెం, ఊరట్టం, తదితర ప్రాంతాల్లో తాగునీరు సౌకర్యం కల్పించాలి. ప్రస్తుతం ఉన్న శాశ్వత మరుగుదొడ్లను అందుబాటులోకి తేవాలి. జంపన్న వాగులో జల్లు స్నానాలకు షవర్లు ఏర్పాటు చేయాలి. దుస్తులు మార్చుకునే గదులు అందుబాటులోకి తేవాలి.  విద్యుత్తు, వాహనాల పార్కింగ్‌, తదితర ఏర్పాట్లు చేయాలి.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు