ఎప్పుడొస్తాయో.. ఎగిరే కార్లు!

ఎగిరే కార్లు.. ఈ ఊహే అద్భుతం కదూ.. త్వరలోనే ఇది సాకారం కానున్నట్లు రూపకర్తలు ఇటీవల ప్రకటించారు.

Updated : 26 Jul 2023 06:48 IST

అధ్వానంగా రహదారులు

ఆకివీడు, భీమవరం అర్బన్‌, పట్టణం, వీరవాసరం, ఉండి, న్యూస్‌టుడే: ఎగిరే కార్లు.. ఈ ఊహే అద్భుతం కదూ.. త్వరలోనే ఇది సాకారం కానున్నట్లు రూపకర్తలు ఇటీవల ప్రకటించారు. దీని సాధ్యాసాధ్యాల విషయం పక్కన పెడితే ఇలాంటి వాహనాలు అందుబాటులోకి వస్తే గానీ జిల్లా వాసుల కష్టాలు తీరేలా లేవు. ఎందుకంటే ఇక్కడి రహదారులపై ప్రయాణమంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. అడుగడుగునా గుంతలు.. వాటిలో వాననీరు.. జర్రున జారిపోయేలా బురద.. ఇలాంటి మార్గాల్లో కేవలం అయిదారు కిలోమీటర్ల ప్రయాణానికి అరగంట సమయం పడుతోంది. ఇక దూర ప్రయాణమంటే పెద్ద ప్రహసనమే. ఒళ్లు.. బళ్లూ గుల్లకావాల్సిందే. భీమవరం, ఆకివీడు పట్టణాలతో అనేక గ్రామాలను అనుసంధానం చేసే రహదారులన్నీ ఇటీవలి వర్షాలకు దారుణంగా మారిపోయాయి. భారీ గుంతలతో వాహనచోదకులు గాయాల పాలవుతున్నారు. కొన్ని మార్గాల్లో వెళ్లేందుకు ఆటో చోదకులు నిరాకరిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత స్పష్టమవుతోంది. ఆకివీడు పరిధిలో మళ్లింపు రహదారి, వైఎస్‌ఆర్‌ కూడలి రోడ్డు, సమతానగర్‌, శాంతినగర్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే రహదారుల్లో ప్రయాణానికి సాహసాలు చేయాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. ఈ అంశంపై ఆర్‌అండ్‌బీ ఏఈ కె.శ్రీహరిరాజు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ కొన్ని రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. మరికొన్ని మార్గాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినట్లు పేర్కొన్నారు.

ఉండి

ఉండి - వాండ్రం గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రహదారి దుస్థితిది. ఉండి నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో మూడేళ్ల నుంచి కనీస మరమ్మతులు చేయకపోవడంతో పూర్తిగా ఛిద్రమైంది. 165 జాతీయ రహదారిపై ఉండి - భీమవరం మధ్య రాకపోకలకు అంతరాయం తలెత్తిన సమయాల్లో ఈ మార్గమే ప్రత్యామ్నాయం. ఈ రహదారి అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని, టెండరు పిలిచారని ఆర్‌అండ్‌బీ ఏఈ కె.శ్రీహరిరాజు తెలిపారు.

జిల్లా కేంద్రమైన భీమవరంలో కలెక్టరేట్‌కు వెళ్లే మార్గాలు ఇటీవలి వర్షాలకు దారుణంగా మారాయి. జీఅండ్‌వీ కెనాల్‌ వెంబడి ఉన్న ప్రధాన రహదారికి మరమ్మతులు చేపట్టగా రెండో మార్గమైన భారతీయ విద్యాభవన్స్‌ వైపు రోడ్డు గోతులమయమైంది. సోమవారం స్పందన కార్యక్రమంలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు ఈ మార్గంలో రాకపోకలకు ఇబ్బంది పడ్డారు.

భీమవరం- తాడేపల్లిగూడెం ప్రధాన రహదారి భీమవరం పరిధిలో ఆర్‌యూబీ వద్ద ఇలా తయారైంది. జిల్లా ఇన్‌ఛార్జి అయిన రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ఈ మార్గాన్ని జాతీయ రహదారిగా మారుస్తామని హామీ ఇచ్చి ఏడాది దాటినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.  ఈ మార్గంలో నిత్యం వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

భీమవరం బస్‌డిపో పక్కన ఉన్న రహదారి ఇది. పురపాలక సాధారణ నిధులతో ఏడాదిన్నర క్రితం తారుతో అభివృద్ధి చేశారు. వాహన రద్దీ కారణంగా కొన్ని నెలలకే గుంతలు పడింది. మరమ్మతులు చేసినా ఇటీవలి వర్షాలకు పూర్తిగా పాడైంది. పాలకొల్లు వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా నర్సయ్య అగ్రహారం మీదుగా బైపాస్‌రోడ్డుకు మళ్లించేందుకు ఇదే ముఖ్యమైన దారి.

గుంత.. లోతెంత

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరం- గొల్లవానితిప్ప మార్గంలో దాసాంజనేయస్వామి ఆలయం సమీపాన రహదారి గుంతలతో ఉంది. కొన్ని గోతులు మోకాలి లోతున ఉండగా వాటిలో నీరు చేరడంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలను చూసిన స్థానికుడు సోమవారం ఇలా బకెట్‌తో గుంతల్లో నీటిని బయటకు తోడారు. వర్షం కురిసి నీరు చేరినప్పుడల్లా ఇలా శ్రమదానం చేస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు