తుమ్మల.. కాంగ్రెస్‌లో చేరిక

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ గూటికి శనివారం చేరారు.

Updated : 17 Sep 2023 04:18 IST

కాంగ్రెస్‌లో చేరిన అనంతరం రాహుల్‌గాంధీని కలిసిన మాజీ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు, చిత్రంలో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, యుగంధర్‌

ఈటీవీ- ఖమ్మం: నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ గూటికి శనివారం చేరారు. హైదరాబాద్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తుమ్మల చేరికతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కాంగ్రెస్‌ మరింత బలోపేతమవుతుందని ఆపార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

భారాసతో ముగిసిన బంధం: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెరాస సత్తాచాటి అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కస్థానం (కొత్తగూడెం) మాత్రమే దక్కించుకుంది. అప్పట్లో ఖమ్మం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల ఓటమి పాలయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈజిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. అప్పటికే జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా.. ఎన్టీఆర్‌, చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన తుమ్మలను గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. 2014 సెప్టెంబర్‌లో గులాబీ కండువాను తుమ్మల కప్పుకొన్నారు. అప్పటివరకు ఉనికిలేని తెరాస.. తుమ్మల చేరికతో బలీయశక్తిగా మారింది. అదే ఏడాది చివర్లో తుమ్మలకు మంత్రిగా కేసీఆర్‌ అవకాశమిచ్చారు. 2015లో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. 2016లో పాలేరుకు ఉపఎన్నిక రాగా.. అక్కడి నుంచి భారాస అభ్యర్థిగా తుమ్మల బరిలో నిలిచి గెలిచారు. ఇలా ప్రభుత్వంలో, పార్టీలో తుమ్మల కీలకంగా వ్యవహరించారు. రాజకీయ పునరేకీకరణలో భాగంగా జిల్లాకు చెందిన పలువురు ముఖ్యనేతలు గులాబీ గూటికి చేరటంతో పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2018లో జరిగిన ఎన్నికల్లో తుమ్మల ఓటమిపాలయ్యారు. పాలేరులో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యే    కందాళ ఉపేందర్‌రెడ్డి గులాబీ గూటికి చేరడంతో రాజకీయంగా తుమ్మల మౌనంగా ఉండిపోయారు.తాజాగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే  కందాళకే భారాస అభ్యర్థిత్వం ఖరారవటంతో తుమ్మల తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్‌ నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపి తమ పార్టీలోకి ఆహ్వానించారు. భారాసకు శనివారం రాజీనామా ప్రకటించిన తుమ్మల.. వెంటనే కాంగ్రెస్‌ గూటికి చేరడంతో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. త్వరలోనే ఉభయ జిల్లాల నుంచి ఆయన అనుచరులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఖమ్మం, పాలేరులో ఒకచోట తుమ్మల ఆధ్వర్యంలో బహిరంగసభ ఏర్పాటుచేసి పార్టీలో చేరికలు ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగే విజయభేరి బహిరంగ సభకు అన్ని నియోజకవర్గాల నుంచి తరలివెళ్లేందుకు తుమ్మల వర్గీయులు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్‌లో జోష్‌: కాంగ్రెస్‌లో తుమ్మల చేరికతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ఆపార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతోంది. తుమ్మల రాకను స్వాగతిస్తూ వివిధ నియోజకవర్గాల్లో ఆయన అభిమానులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకొన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌కు ప్రత్యర్థిగానే రాజకీయాలు చేస్తూ వచ్చిన తుమ్మల తాజాగా అదే పార్టీలో చేరటం కొసమెరుపు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని