కష్టకాలంలో నిలబడి.. ఎమ్మెల్యేగా గెలిచి

కాంగ్రెస్‌ అభ్యర్థిగా అనూహ్య విజయం సాధించిన మాలోత్‌ రాందాస్‌నాయక్‌ రాజకీయ జీవితం పరిశీలిస్తే ఆది నుంచి ఆటుపోట్లే.

Updated : 04 Dec 2023 06:57 IST

పొన్నెకల్లు కౌంటింగ్‌ కేంద్రం వద్ద రాందాస్‌నాయక్‌ను అభినందిస్తున్న అభిమానులు

వైరా, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అభ్యర్థిగా అనూహ్య విజయం సాధించిన మాలోత్‌ రాందాస్‌నాయక్‌ రాజకీయ జీవితం పరిశీలిస్తే ఆది నుంచి ఆటుపోట్లే. బీకాం చదివిన ఆయన సామాన్య కార్యకర్తగానే జీవితం ప్రారంభించారు. తెదేపాలో క్రియాశీలకంగా ఉంటూ 2014లో వైరా నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించినా టికెటు లభించలేదు. అయినా రాజకీయాల్లోనూ కొనసాగారు. 2017లో కాంగ్రెస్‌లో చేరారు. 2018లో కాంగ్రెస్‌ టికెట్టు ఆశించినా దక్కలేదు. అయినా నిరాశ చెందకుండా కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో తెరాస బలంగా ఉన్నా కాంగ్రెస్‌ను వదలకుండా కష్టకాలంలో ఆదుకున్నారు. ప్రతిపక్షంలో ఉంటూ ఐదు మండలాల్లో నిత్యం పర్యటించారు. అనేక ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. అప్పటి నుంచి పార్టీని ఆదుకుంటూ తనవెంట కలిసిరాని నాయకులతోనూ సఖ్యతగా ఉంటూ సీఎల్‌పీ నాయకుడు మల్లు భట్టివిక్రమార్కకు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి టికెటు సాధించేందుకు ఆయన ఎంతో పోరాటం చేశారు. టికెటు కోసం ముఖ్యనేతల అనుచరుల నుంచి చతుర్మఖ పోటీని ఎదుర్కొని అనూహ్యంగా టికెటు సాధించడంతోపాటు ప్రజాపోరులో తిరుగులేని మెజార్టీ సాధించారు. ప్రస్తుత ఎన్నికలో నియోజకవర్గ వ్యాప్తంగా తెదేపా శ్రేణులు ఆయనకు మద్దతు పలికి అదే స్థాయిలో పని చేయడం సైతం కలిసొచ్చిందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాందాస్‌ సతీమణి లలిత వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగిగా ఉన్నారు. కుమార్తెలు గాయత్రి, చందనతో పాటు కుమారుడు విఘ్నేశ్‌ విద్యనభ్యసిస్తున్నారు. రాందాస్‌ స్వస్థలం లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ గ్రామం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని